నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది నెటిజన్లు పెట్టే సరదా సందేశాల వల్ల సాయం అందక కరోనా రోగులు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణూ దేశాయ్ కరోనా కష్టకాలంలో తనకు దోచిన సాయం అందిస్తుంది. ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా కోవిడ్ బాధితులకు ప్లాస్మా, ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్‌లో బెడ్స్ లేదా మందులు వంటివి వివరాలను అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. తన ఇన్‌స్టా ఖాతాలో మెసేజ్ ఇన్ బాక్స్‌లో మెసేజ్ పెట్టిన వారికి సమయానికి సరైన వైద్యం అందేలా చూస్తున్నారు. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో కరోనా విజృంభణను చూసి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతోన్నాయి. రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. ఇలా కరోనా దెబ్బకు మన దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది.
దీనికి తోడు వైద్య సదుపాయాలు అరకొరగా ఉంటున్నాయి. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలను వదులుతున్నారు. ఇలాంటి సమయంలో కొంత మందికైనా సాయపడాలనే ఉద్దేశ్యంతో సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమకు తెలిసిన హాస్పిటల్ వివరాలు, ఖాళీగా ఉన్న బెడ్స్, వెంటిలేటర్, ఐసీయూ బెడ్స్ ఇలా కావాల్సిన సమాచారాన్ని అంతా షేర్ చేస్తూ ఉన్నారు. తమకు తెలిసిన చోట ఉన్న ఖాళీల గురించి చెబుతూ అవసరంలో ఉన్న వారికి చేతనైన సాయం చేస్తున్నారు. గత పది రోజుల నుంచి రేణూ దేశాయ్ కూడా రంగంలోకి దిగారు. అవసరమైన మందులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వైద్యం కోసం ఏర్పాట్లు చేయిస్తున్నారు. అలా కోవిడ్ పేషెంట్స్ సహాయార్థం ఎవ్వరైనా సరే మెసెజ్‌లు చేయండి చేతనైన సాయం చేస్తాను అని రేణూ దేశాయ్ ప్రకటించారు. అలా తన ఇన్ బాక్స్ ఓపెన్ చేయగానే అన్ని రకాల మెసెజ్‌లు కుప్పకుప్పలుగా వచ్చాయి.
అందులో అవసరార్థం చేసిన వారికి కంటే ఆకతాయిగా చేసిన మెసెజ్‌లే ఎక్కువగా వచ్చాయి. దీనిపై రేణూ దేశాయ్ కాస్త ఘాటుగా స్పందించారు. ‘దయచేసి అందరూ ఓ విషయాన్ని అర్థం చేసుకోండి.. నాకు వీలైనంతలో గత పది పన్నెండు రోజుల నుంచి సాయం చేస్తూనే వస్తున్నాను. నేనేమీ రాజకీయ నాయకురాలిని కాదు.. మీరు ప్రశ్నించడానికి ఓట్లు వేసి ఎన్నికైన ప్రజా ప్రతినిధిని కాదు.. వెళ్లి మీరు ఓటు వేసిన నాయకులను అడుక్కోండి.. వారిని ప్రశ్నించండి. మీరు ఇలాంటి సాయం చేయండి అంటూ డిమాండ్ చేస్తూ వేసే రూడ్ మెసెజ్‌లు చూస్తుంటే కొన్ని సార్లు నా స్పిరిట్ దెబ్బతింటుంది.. మీ మెసెజ్‌ను నేను చూడకపోతే.. మళ్లీ చేయండి.. ఎందుకంటే నా ఇన్ బాక్స్‌లో లెక్కలేనన్ని మెసెజ్‌లు వస్తూనే ఉన్నాయ్’ అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.