సినీ పరిశ్రమలో వరుస విషాదాలకి బ్రేక్ పడటం లేదు. ఇప్పటికే కరోనా కారణంగా చాలా మంది స్టార్స్ అయిన వారిని కోల్పోయారు. అప్పటి నుండి ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవీనా తండ్రి, రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్ (85) ఈ శుక్రవారం కన్ను మూశారు.
రవి టాండన్ చాలా కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి చికిత్స తీసుకుంటూనే ముంబైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో రవి టాండన్ మరణించారు. అద్భుతమైన చిత్రాలను అందించిన రవి టాండన్ మరణ వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక రవీనా టాండన్ తన తండ్రి అంతిమ కార్యక్రమాలను స్వయంగా నిర్వహించారు. ఈ సమయంలో తండ్రిని తలుచుకుంటూ రవీనా ఎమోషనల్ అయ్యారు. ‘‘ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావ్ పప్పా.. ప్రతి అడుగూ నువ్వే వేయిస్తావు’’ అంటూ.. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. ఏదేమైనా.. అవ్వడానికి కూతురైనా కొడుకులా మారి తండ్రి దహన సంస్కారాలు నిర్వర్తించడం విశేషం. ఇదే సమయంలో ఆమె ఈ కష్టం నుండి త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.