నాట్లు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరుకు రైతు ఆందోళన చెందుతునే ఉంటాడు. అధికశాతం ఎలుకల వల్లే రైతన్న నష్టపోతున్నాడు. ఎందుకంటే రైతన్న ఎన్నో వ్యయ ప్రయాసలు పడి పంటను చేతికి దక్కించుకున్నాక ధాన్యాన్ని చీడ పీడలతో పాటూ ఎలుకలూ నాశనం చేస్తాయి. అలానే ఇప్పుడు తెలంగాణాలో ఓ రైతును ఎలుకలు రోడ్డున పడేశాయి. అయితే ధాన్యాన్ని తిని కాదు రైతన్న అప్పు చేసి తన వైద్యం కోసం దాచుకున్న డబ్బును కొరికి పడేశాయి.
మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు ఇంద్రనగర్ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా అనే రైతు కూరగాయలను పండిస్తూ వాటిని విక్రయిస్తుంటాడు. ఇటీవల అతడికి అనారోగ్యం కలిగింది. తన కడుపులో ఏర్పడిన కణితిని ఆపరేషన్ చేసి తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో తెలిసినవారి వద్ద అప్పు చేశాడు. వాటితోపాటు కూరగాయలు అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఇంట్లోని చెక్క బీరువాలో దాచాడు.
రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డబ్బును పరిశీలించేందుకు బీరువా తెరిచి చూడగా రూ.2 లక్షలకు సంబంధించిన నోట్లను ఎలుకలు పనికిరాకుండా కొరికేశాయి. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ డబ్బును తీసుకొని రైతు బ్యాంకుకు వెళ్లగా అవి చెల్లవని చెప్పారు. రిజర్వ్ బ్యాంక్‌కు వెళ్లి ప్రయత్నించాలని సూచించారు.
ఈ విషయం మీడియా, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంగతి దృష్టికి రావడంతో గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న రెడ్యాకు ఫోన్ అన్ని విధాలా సాయం చేస్తామని అతడి చికిత్స విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని డబ్బులు తిరిగి వచ్చేందుకు అధికారులతో మాట్లాడతామని ఆమె హామీ ఇచ్చారు.