హర్యానా- ప్రభుత్వం పేద, మధ్య తరగతి వారికి ఇచ్చే రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు రేషన్ షాప్ ల దగ్గర గంటల తరబడి క్యూలైన్ లో నిలబడాలి. కానీ ఇకపై అలాంటి అవసరం లేదు. ఎందుకంటే మనం డబ్బులు డ్రా చేసుకోవడానికి ఏటీఎంలు ఎలా ఉన్నాయో, అలాగే రేషన్ సరుకులు కూడా ఏటీఎం లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఎంటి ఆశ్చర్యంగా ఉందా.
దేశంలో మొట్టమొదటి సారిగా రేషన్ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త పైలట్ ప్రాజక్ట్‌ను గరుగ్రామ్‌లోని ఫరూక్ నగర్‌లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రారంభించారు. ఈ రేషన్ ఏటీఎం ఐదు నిమిషాల లోపు 70 కిలోల బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదల చేస్తుంది. ఈ రేషన్ ఏటీఎం మెషిన్ టచ్ స్క్రీన్ ద్వారా పని చేస్తుంది.
ఈ రేషన్ ఏటీఎం మెషీన్‌లో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుంది. దీని ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ జరగగానే, లబ్ధిదారునికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్‌గా సంచుల్లో ధాన్యాన్ని నింపేస్తుంది. ఈ రేషన్ ఏటీఎం ద్వార ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరుకులు అందుతాయని, ఈ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఇదేనంటూ అధికారులు తెలిపారు.
ఇది దేశంలోనే మొట్టమొదటి రేషన్ ఏటీఎం గా రికార్డుల్లోకెక్కింది. ఐతే ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫరూకనగర్‌లో విజయవంతంగా నిర్వహించిన తరువాత, యూఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు హర్యానా ప్రభుత్వం తెలిపింది. ఈ ఏటీఎంలో రేషన్ సరుకులు.. గోధుమలు, ధాన్యం, చిరుధాన్యాలు సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించారు.