బంగ్లాదేశ్- ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు చాలా వింతలు జరుగుతుంటాయి. అందులోను చిత్ర విచిత్రమైన జంతువులు పుడుతుంటాయి. జంతువులకు మనిషి రూపం, మనుషులకు జంతువు రూపాలున్న సంతానం కలగడం మనం చాలా సందర్బాల్లో చూశాం. ఇలాంటి అరుదైన ఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. ఓ అరుదైన ఆవుదూడను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఇంతకీ ఆ ఆవు ప్రత్యేకత ఎంటనే కదా మీ సందేహం..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని చారీగ్రామ్‌లో ఒక ఆవు దూడా జన్మించింది. 23 నెలల వయసున్న ఈ ఆవు దూడ కేవలం 51 సెంటీమీటర్లు అంటే 20 అంగుళాల ఎత్తుమాత్రమే ఉంది. దీని బరువు కూడా కేవలం 28 కిలోలు మాత్రమే. ఇంత చిన్న ఆవుదూడ పుట్టడం చాలా అరుదు. ఇలాంటి చిట్టి ఆవుదూడ ఈ ఉర్లో ఉన్నట్లు తెలిసిన చుట్టుపక్కల గ్రామాల జనం దాన్ని చూసేందుకు ఆసక్తిగా వస్తున్నారు. ఇక ఈ ఆవు యజమాని హసన్ హాలాదార్, తన ఆవు రాణిని చూడటానికి వచ్చిన వారందరికి ఎంతో ఉత్సాహంగా దాన్ని చూపిస్తున్నారు.
ఈ ఆవుదూడ రాణి ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవు అని, దీన్ని గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కించాలని హాలాదార్ చెబుతున్నాడు. కేరళకు చెందిన మాణిక్యం అనే ఆవు పేరిట అతి చిన్న ఆవుగా రికార్డు ఉంది. 2014లో మాణిక్యం 24 అంగుళాల ఎత్తుతో పుట్టడంతో దీన్ని ప్రపంచంలోనే అత్యంత చిన్న ఆవుగా గిన్నీస్ రికార్డుల్లో చేర్చారు. ఇప్పుడు తన ఆవు రాణి అంతకన్నా చిన్నదని, దీనికి గిన్నీస్ రికార్డు ఇవ్వాలని హాలాదార్ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక ఈ చిన్ని ఆవు రాణికి ఇతర ఆవులు, జంతువులంటే చాలా భయమేస్తుందట. అందుకే రాణిని ప్రత్యేకంగా పెంచుతున్నామని యజమాని చెప్పాడు. అంతే కాదు నడవడానికి కూడా రాణి చాలా ఇబ్బది పడుతుందని, ఐతే దాన్ని ఎత్తుకుని ఇలా ఆరుబయట తిప్పితే భలే సంతోషపడుతుందని తెలిపాడు. భలే ఉంది కదా రాణి.