ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మల్టిస్టారర్ మూవీ భీమ్లా నాయక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో భారీ విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు రీమేకే భీమ్లా నాయక్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇగో ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుందనేది భీమ్లా నాయక్ స్టోరీ.
ఇప్పటికే భీమ్లా నాయక్ నుంచి విడుదలైన సాంగ్, గ్లింప్ పవన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఐతే యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో రానా దగ్గుబాటి పుట్టిన రోజు సందర్భంగా చిత్రం బృందం ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేసింది. రానాకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఇక ఈ వీడియో భీమ్లా నాయక్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ.. సస్పెండెడ్.. అంటూ రానా దగ్గుబాటి ఆవేశంతో చెప్పే డైలాగ్ తో ఈ వీడియో అదిరిపోయింది. ఈ వీడియో చూస్తుంటే ఇందులో రానా పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందనేది ఊహించికోవచ్చు.
భీమ్లా నాయక్ సినిమాలో రానా డేనియల్ శేఖర్ అనే నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నిత్యామీనన్ నటిస్తుండగా, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. అన్నట్లు భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.