స్పెషల్ డెస్క్- శుక్రవారం ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పండగను జరుపుకుంటున్నారు. మన దేశంతో పాటు ప్రపంచం వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొత్తం 30 రోజుల పాటు ముస్లింలు ఎంతో నిష్టతో చేపట్టిన ఉపవాస దీక్షలు గురువారంతో ముగిశాయి. గురువారం నెలవంక దర్శనం అనంతరం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు శుక్రవారం నిర్వహిస్తున్నారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. అయితే ఒక్క సౌదీ దేశాల్లో మాత్రం ఒక రోజు ముందుగా గురువారం పండుగను నిర్వహిస్తున్నారు. సౌదీ ఆరేబియాతో పాటు దుబాయ్, కువైట్ దేశాల్లో రంజాన్ వేడుకులు గురువారం జరుగుతున్నాయి. మిగతా దేశాల్లో శుక్రవారం రంజాన్ ను జరుపుకుంటున్నారు. ముస్లింలకు రంజాన్ అతి పవిత్రమైన, పెద్ద పండద. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రంజాన్ ప్రతి యేడాది తొమ్మిదో నెలలో వస్తుంది.
రంజాన్ పర్వదినానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. రంజాన్ మాసంలోనే పవిత్ర దివ్య ఖురాన్ గ్రంధం అవతరించిందని చెబుతారు. ఈ మేరకు ఈ నెల మొత్తం కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఆ తరువాత షవ్వాల్ నెల మొదటి రోజున ఈద్-ఉల్-ఫితర్‌ను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో పవిత్ర ఖురాన్ పఠించడంతో పాటు, పేదవారికి దాన ధర్మాలు చేస్తారు. ఇక ఆకాశంలో నెలవంక కనిపించే రోజును బట్టీ రంజాన్ ను ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో చేసుకుంటారు. గత యేడాదిలాగే ఈ సంవత్సరం కూాడా కరోనా నేపధ్యంలో ఇళ్లల్లో ఉండే రంజాన్ పండగను జరుపుకుంటున్నారు. ఈద్ ఉల్ ఫితర్ వేడుకలను ఇళ్లల్లోనే జరుపుకోవాలని మతపెద్దలు, పలువురు ముస్లిం నాయకులు సూచించారు. సామూహిక ప్రార్థనల వల్ల కరోనా సోకే అవకాశం ఉండటంతో ఎవరి ఇళ్లల్లో వారు ప్రార్ధనలు చేసుకోవాలని చెప్పారు. ముస్లిం సోదరీ, సోదరులందరికి సుమన్ టీవీ ఈద్ ముబారక్.