అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల వివాదం అంతకంతుకు ముదురుతోంది. ధియేటర్లలో టిక్కెట్ ధరను బాగా తగ్గించి, 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు నిర్ణయిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరీ ఇంత తక్కువగా సినిమా టిక్కెట్ల ధరను నిర్ణయిస్తే, సినిమా పరిశ్రమ నష్టాలబాట పట్టడం ఖాయమని, ఇలా ఐతే సినిమా పరిశ్రమ దివాలా తీయడం తధ్యమని ఇండస్ట్రీ పెద్దలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.
కొంత మంది తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు, హీరోలు జగన్ ప్రభుత్వంపై భహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొంత మంది తగ్గించిన సినిమా టిక్కెట్ల ధరను పెంచే విషయంపై పునరాలోచించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టిక్కెట్ ధరలపై సీఎం జగన్ ఓ కమీటీనీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ త్వరలోనే రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరలను నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
ఇదిగో ఇటువంటి సమయంలో ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తనదైన శైళిలో స్పందించారు. నిత్యావసర వస్తువులపై లేని ఫిక్స్డ్ రేట్లు, సినిమా టికెట్లపైనే ఎందుకు అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. వైసీపీకి అనుకూలంగా, టీడీపీ, జనసేన నాయకులపై సెటైరికల్ గా సినిమాలు తీసే వర్మ, సినిమా టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
ఒక పర్సన్ సినిమా తీస్తాడు, తనకి నచ్చినట్టుగా ఇష్టమైన రేట్లు పెట్టుకుంటాను, ఓపిక ఉన్నోడు సినిమా చూస్తాడు, లేనోడు మానేస్తాడు, ఈ ఇష్యూలో ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అని ప్రశ్నించాడు రామ్ గోపాల్ వర్మ. ఒకడు హోటల్ పెట్టాడు, ఇడ్లీ పది.. వంద.. వెయ్యి.. ఇలా వాడికి ఇష్టమొచ్చిన రేటు పెట్టుకుంటాడు, ఇష్టమున్నోడు తింటాడు, ఎక్కువ రేటు అనుకున్నోడు మానేస్తాడు, గవర్నమెంట్ వచ్చి ఇంతే రేటు పెట్టాలని ఎలా అంటుంది, ఆ లాజిక్ నాకు అర్ధం కాలేదు.. అని తన వాదన వినిపించాడు వర్మ.
ఉప్మా మీద.. ఇడ్లీ మీద.. చీరల మీద అన్నింటి మీద ఫిక్స్డ్ రేట్ పెట్టాలి కదా అని ప్రశ్నించారు ఆర్జీవీ. ఒక్క సినిమాలపైనే ఈ ఫిక్స్డ్ రేట్లు ఎందుకు పెడుతున్నారు, గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అని అన్నారు. ప్రభుత్వం పెట్టుబడులు పెడితే అది వేరే విషయం, సినిమా తీయడానికి డబ్బులు ఇచ్చారా, థియేటర్స్ కట్టడానికి లోన్లు ఇచ్చారా, అన్న టెక్నికల్ ఇష్యూ నాకు తెలియదు కానీ.. ఇవేవీ లేనప్పుడు ప్రైవేటు ప్రాపర్టీపై ప్రభుత్వాని రైట్ ఎలా ఉంటుంది.. అని తన స్తైల్లో వ్యాఖ్యానించారు రామ్ గోపాల్ వర్మ.