ముంబయి- షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ముంబయి సముద్ర తీరంలోని క్రూయిజ్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడులు నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆర్యన్ ఖాన్ తో పాటు 20 మందిని అరెస్ట్ చేసింది. వారందరికి కోర్టు రిమాండ్ విధించడంతో అక్టోబర్ 3 వతేదీ నుంచి ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉన్నాడు.
అదిగో అప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ జైల్లోనే ఉంటున్నాడు. తన కొడుకుకు బెయిల్ ఇప్పించేందుకు షారుఖ్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కోర్టు ఎంతకీ బెయిల్ మంజూరు చేయకపోవడంతో ఇక లాభం లేదని, దేశంలోనే పేరు మోసిన అడ్వకేట్, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి ని ఆర్యన్ బెయిల్ పిటీషన్ పై వాధించేందుకు లాయర్ గా నియమించుకున్నారు.
ఇంకేముంది ముకుల్ రోహిత్గి ఇలా ఎంటర్ అయ్యారో లేదో అలా బెయిల్ వచ్చేసింది. ఆర్యన్ ఖాన్ తరపున బలంగా వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్గి ఎన్సీబీని కార్నర్ చేయగలిగారు. దీంతో కోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇక 25 రోజులుగా జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ శుక్రవారం బెయిల్ పై విడుదలకాబోతున్నాడు.
ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ బెయిల్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. దేశంలోనే పేరుమోసిన అడ్వకేట్ ముకుల్ రోహిత్గి కంటే ముందు వాదించిన లాయర్లు అసమర్థులా అని ఆర్జీవి ప్రశ్నించారు. అంటే ఇన్ని రోజులు తప్పు చేయకుండానే ఆర్యన్ ఖాన్ ను జైల్లో ఉంచారా.. అని వర్మ కొత్త వాదన లేవనెత్తారు. దేశంలో అందరు ఇలా ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరు.. అలాంటి వారంతా కూడా జైళ్లలో మగ్గిపోవాల్సిందేనా.. అని రాంగోపాల్ వర్మ నిలదీశారు. ఆర్జీవి వ్యాఖ్యలు నిజంగా ఆలోచించాల్సినవేనని నెటిజన్స్ అంటున్నారు.
Since the majority of people cannot hire someone as expensive as Mukul Rahtogi that explains the huge no. of innocent people languishing in jails as undertrials
— Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2021