కాకతీయుల ఘనమైన శిల్పకళా వైభవానికి,అద్భుత నిర్మాణశైలికి ప్రతీక, 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సుప్రసిద్ధ రామప్ప(రుద్రేశ్వర స్వామి)ఆలయంవైపు ఇప్పుడు విశ్వమంతా అబ్బురపడి చూస్తోంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం లభించింది.రామప్పకు ప్రపంచ వారసత్వ సంపదగా ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది.
చైనాలోని ఫ్యూజు వేదికగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ (యూడబ్ల్యూహెచ్‌సీ) సమావేశం వర్చువల్‌గా జరుగుతోంది.డబ్ల్యూహెచ్‌సీ ప్రతినిధులు రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేర్చారు. రామప్పకు మద్దతుగా రష్యా సహా 17 దేశాలు ఓటు వేశాయి.రామప్పకు అరుదైన గుర్తింపు లభించడం పట్ల తెలంగాణ సహా దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
రామప్ప ఎంపిక పరంగా సమావేశంలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచ వారసత్వ జాబితాలోకి రామప్పను చేర్చడాన్ని నార్వే వ్యతిరేకించింది. రామప్పను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు తొమ్మిది లోపాలు ఉన్నట్లుగా 2019లో పాలంపేటను సందర్శించిన పురావస్తు కట్టడాలు, క్షేత్రాల అంతర్జాతీయ మండలి (ఐసీవోఎంవోఎస్) ప్రతినిధులు తమ నివేదికలో ప్రస్తావించారు. అయితే తక్షణమే రామప్పను వారసత్వ కట్టడంగా గుర్తించేలా రష్యా ప్రత్యేక చొరవ తీసుకుంది.
2019 నాటి ఐసీవోఎంవోఎస్ నివేదికను తోసిరాజని 22.7 నిబంధన కింద రామప్పను కట్టడాల నామినేషన్లలో పరిగణనలోకి తీసుకునేలా చేసింది. అటు భారత్ కూడా దౌత్య పద్ధతిలో రాయబారం నెరిపింది. చారిత్రక కట్టడాలను ఎంపిక చేసేందుకు విచ్చేసిన ప్రతినిధుల తాలూకు 24 దేశాలకు చారిత్రక కట్టడంగా రామప్ప విశిష్టత గురించి వివరించింది. ఇది ఫలితాన్నిచ్చింది.రామప్పకు మద్దతుగా 24 దేశాల్లో రష్యా సహా ఇథియోపియా, ఒమన్, బ్రెజిల్, ఈజిప్ట్, స్పెయిన్, థాయ్‌లాండ్, హంగరీ, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర 17 దేశాలు ఓట్లు వేశాయి.
2019లో భారత్ నుంచి యునెస్కోకు రామప్ప ఆలయం ఒక్కటే నామినేట్ అయింది. రామప్పకు మనదేశం నుంచి ఇతర కట్టడాలేవీ పోటీలో లేకపోవడమూ కలిసొచ్చింది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం తొమ్మిదేళ్లుగా ప్రయత్నాలు సాగాయి.రామప్ప తొలిసారిగా 2012లో యునెస్కోకు నామినేట్ అయింది. తర్వాత 2013, 14, 19లో నామినేట్ అయింది. 2019 వారసత్వ కట్డడాల ఎంపిక కోసం 2020లో జరగాల్సిన యునెస్కో ప్రతినిధుల సమావేశం కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడింది.
ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించడంతో రామప్ప ఆలయం ఇక కొత్త కళ సంతరించుకోనుంది. శిథిలమవుతున్న అద్భుత శిల్ప సంపదను పరిరక్షించే అవకాశం కలగనుంది. ఆలయ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధిక నిధులు రావడంతోపాటు పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. ఆలయ సందర్శనకు దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలుంటాయి. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి, సందర్శనకు వచ్చే భక్తులు, పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించే వీలుంటుంది.
ఆలయం అభివృద్ధితో పాటు స్థానికంగా వ్యాపారాలు,ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంటుంది.రామప్పకు కేంద్ర పర్యాటక శాఖ నుంచి మరిన్ని నిధులు కేటాయించే వీలుంది.ఇక ప్రపంచ వారసత్వంగా గుర్తించినందున..ఆలయ పరిరక్షణ బాధ్యత కూడా యునెస్కో తీసుకుంటుంది.ఆలయానికి ఏవైనా మరమ్మతులు చేయాల్సివస్తే అంతర్జాతీయ స్థాయిలో వనరులు లభిస్తాయి.