షేర్ మార్కెట్.. ఒక్క రోజులో బండ్లను ఓడలు, ఓడలను బండ్లు చేయగల మాయా ప్రపంచం. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి ఊహకందని లాభాలు పొందిన వారు కొందరు, కోలుకోలేని నష్టాలను చవిచూసింది మరి కొందరు. మార్కెట్ ట్రేడింగ్ పై పరిజ్ఞానం కలిగి ఏళ్లుగా సంపాదించిన అనుభవంతో గంటల్లో భారీ లాభాలను పొందే బిగ్‌బుల్స్ కొందరు. వారిలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఒకరు. షేర్ మార్కెట్ పై అవగాహన ఉన్నవారిలో చాలామంది ఝున్‌ఝున్‌వాలా గురించి తెలిసే ఉంటుంది. వివిధ కంపెనీల్లో 30 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు ఝున్‌ఝున్‌వాలా. స్టాక్‌మార్కెట్ వ్యాపారంలోనే వేల కోట్లు సంపాదించారు. ఇక తాజాగా ఈయన ఖాతాలోకి మరో రూ.21 కోట్లు వచ్చిపడ్డాయి.
అది కూడా 24 గంటల వ్యవధిలోనే కావడం విశేషం. ప్రముఖ మీడియా సంస్థ జీ మీడియా గ్రూప్ ఎండీ పదవి నుంచి పునీత్ గోయెంకాను తొలగించాలంటూ పెట్టుబడిదారులు పట్టుబట్టారు. ఈ విషయం వార్తల్లోకి ఎక్కడంతో సెప్టెంబరు 14న మంగళవారం ఆ కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవి చూశాయి. ఇదే సమయంలో ఆ కంపెనీ షేర్లపై కన్నేశారు ఝున్‌ఝున్‌వాలా. ఆ కంపెనీ షేర్ల ధర పడిపోతూ రూ.220.44 దగ్గర ఉన్నప్పుడు ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రారే కంపెనీ ఒకేసారి 50 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. లోయర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతున్న సమయంలో ఝున్‌ఝున్‌వాలా భారీగా షేర్లు కొన్నారనే ప్రచారం జరగడంతో ఒక్కసారిగా షేర్ ధర పెరిగింది. మంగళవారం రూ.187కు వెళ్లిన షేర్ ధర బుధవారం ఒక్కసారిగా ఎగసిపడింది. ఒకానొక దశలో 287ను తాకింది. చివరికి రూ.261 దగ్గర స్టేబుల్ అయింది. ఈ భారీ పెరుగుదలతో ఒక్కరోజులోనే ఝున్‌ఝున్‌వాలాకి రూ.21 కోట్ల లాభం వచ్చిపడింది.