భారతీయ చలన చిత్ర రంగంలో నాలుగు దశాబ్దాలుగా సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నరజినీకాంత్ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును అందుకున్నారు. రజనీకాంత్ గత నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమకు చేస్తోన్న సేవలు గుర్తించిన కేంద్రప్రభుత్వం.. ఆయన్ని ఈ పురస్కారంతో గౌరవించింది. ఈ అవార్డును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు. ఇక ఈ అవార్డులు 17వ జాతీయ చలన చిత్ర అవార్డుల సమయం నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు.
1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న 51వ వ్యక్తి రజనీకాంత్. ఇక రజినీకాంత్ విషయానికి వస్తే.. నవ్వులో, నడకలో వేగం, గొంతులో గాంభీర్యం, మ్యానరిజంలో మాస్ అప్పియరెన్స్ అన్నీ కలిసి ఆయన్ని సూపర్ స్టార్‌ని చేశాయి. రజినీకాంత్ సిగరెట్ వెలిగించినా, సెల్యూట్ చేసినా…కోట్ వేసినా.. అదొక స్టైల్..అదొక స్పెషల్ మ్యానరిజం. వెండితెరపై ఆయన కనిపిస్తే చాలు ఈలలు వేస్తూ ఫ్యాన్స్ సంతోషాలకు అవధులు ఉండవు. విదేశాల్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అతి కొద్ది నటుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు.
తన అవార్డును తన అన్నయ్య సత్యనారాయణ గైక్వాడ్, గురువు బాలచందర్, తనస్నేహితుడు రాజ్ బహద్దూర్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. 2021 మార్చ్ 23న ఈ అవార్డుల ప్రకటన జరిగింది. ఈ అవార్డు తనకు రావడం గర్వంగా ఉందని.. చాలా ఆనందంగా ఉందని.. తనపై ఇంకా బాధ్యత పెంచేసిందని చెప్పుకొచ్చారు రజినీ. తను కండక్టర్‌గా పని చేస్తున్న రోజుల్లో తనలో నటుడున్నాడని గుర్తించి ఇండస్ట్రీకి పంపించిన స్నేహితుడు రాజ్ బహద్దూర్‌కు ఈ అవార్డు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు రజినీకాంత్. దర్శకులకు, నిర్మాతలకు, టెక్నీషియన్స్‌కు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్‌కు మనస్పూర్థిగా ధన్యవాదాలు తెలిపాడు రజినీ. చివరగా తమిళ ప్రజలకు చేతులెత్తి మొక్కాడు సూపర్ స్టార్. ఈయన నటించిన తాజా చిత్రం అన్నాత్తే నవంబర్ 4న దివాళి కానుకగా విడుదల కానుంది. తెలుగులో పెద్దన్న పేరుతో విడుదలవుతుంది.