హైదరాబాద్- గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. తౌక్టే, యాస్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వానలు కురిశాయి. ఆ తరువాత మళ్లీ అప్పుడుప్పుడు ఎండలు సైతం మండిపోతున్నాయి. పగటి ఉష్టోగ్రతలు భారీగానే నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో శనివారం 36.0 నుంచి 44.6 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 నుంచి 22.4 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా కుబీర్‌లో అత్యల్పంగా 22.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ లో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.6, కనిష్ఠం 26.6 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 47 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.
ఇక ఇప్పుడు మరోసారి హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని వార్త చెప్పింది. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా జూన్ రెండో తేదీ వరకు రాష్ట్రంలోని పలుజిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరో వైపు కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందే తెలంగాణలో అప్పుడే వర్షాలు కురుస్తున్నాయి.
ఇక గ్రేటర్ హైదరాబాద్ లో ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల ఐదు రోజుల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం పడింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా బంట్వారంలో 53.3 మిలీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, రాష్ట్రంలో వాతావరణం కొంత చల్లబడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.