న్యూఢిల్లీ-హైదరాబాద్- నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ రోజు విడుదల కానున్నారు. సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. రాజద్రోహం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘురామ కృష్ణరాజు అరెస్ట్ చేసింన సంగతి తెలిసిందే. ఆ తరువాత బెయిల్ కోసం రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీఐడీ అధికారులు తనను తీవ్రంగా కొట్టారని ఆయన ఆరోపించడంతో సుప్రీంకోర్టు రఘురామ కృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనకు ఆర్మీ ఆస్పత్రి వైద్యుల అన్ని రకాల పరీక్షలు చేసి సుప్రీంకోర్టుకు మెయిల్ ద్వారా నివేదిక పంపించారు.
ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికపై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఆయన కాలిపై గాయాలైనట్లు ఆర్మీ ఆస్పత్రి నివేదికలో తేలిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలె పెట్టుకుని బెయిల్ మంజూరు చేస్తున్నామని పేర్కొంది. ఇక పిటిషనర్ చేసిన ప్రకటనలు వీడియో రూపంలో ఉన్నందున కస్టడీలో విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. బెయిల్‌పై ఉన్న సమయంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలపై పత్రిక, టీవీ, సామాజిక మాధ్యమాలతో మాట్లాడకూడదని రఘురామ కృష్ణరాజును ఆదేశించింది.
ట్రయల్ కోర్టు విచారణకు లక్ష రూపాయల వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని, సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామకృష్ణరాజు శనివారం డిశ్చార్జ్ కానున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు సుప్రీం కోర్టు రఘురామ కృష్ణరాజుకు బెయిల్ మంజూరు చేసిన నేపధ్యంలో, దీన్ని సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటీషన్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయుత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసు ముందు ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తినెలకొంది.