ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం ఉదయం ముగిశాయి. అంత్యక్రియలకు ముందు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆర్ నారాయణ మూర్తి కూడా కైకాలకు నివాళులు అర్పించారు. అనంతరం కైకాల గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఆర్ నారాయణమూర్తి కైకాల సత్య నారాయణ గురించి మాట్లాడుతూ.. ‘‘ ఎస్వీ రంగారావుగారి తర్వాత ఆ స్థానాన్ని మళ్లా ఎవరన్నా పూడ్చగలరా అంటే?… ఎస్ నేను పూడ్చగలనని వచ్చిన మహా నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. ఈ మాట స్వయంగా రంగారావు గారే చెప్పారు. నా వారసుడు అని. ఏమ్ సత్యనారాయణ గారు. ఓ హీరోగా ప్రవేశించి, విలన్‌గా రానిచ్చి.. ఎన్టీరామారావుతో ఢీ అంటే ఢీ అని.. ఎస్వీ రంగారావుతో ఢీ అంటే ఢీ అని.. అనేక మంది మహాను భావులతో ఢీ అంటే అంటే ఢీ అని.. అమోఘమైన సెంటిమెంట్‌ను పండించారు.
తాతా మనవడు, సంసార సాగరం, శారద.. ఏమి యాక్టింగ్ ఏమి పర్ఫార్మెన్స్ ఆ మహానుభావుడిది. ఏం ఏడిపిస్తాడాయన, ఏం నవ్విస్తాడాయన, ఏం ఎనర్జీ తెప్పిస్తాడాయన, నిజంగా ఆ మహానుభావుడి మరణం.. చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. స్వయంగా నా సినిమాలో మహానుభావుడు. భూపాలుడు సినిమాలో ఓ రైతు వేషం వేసి మెప్పించారు. నా చిత్ర విజయానికి కారణమైన మహానుభావుడికి ధన్యవాదాలు. ఆయన సినిమా కమిట్ అయితే.. ఆ నిర్మాత శ్రేయస్సు కోరుకునేవాడు. రోజులో 18 గంటలు కష్టపడేవారు. నిర్మాతలు ఎవరూ తన వల్ల ఇబ్బందులు పడొద్దని ఆలోచించేవారు. చిత్ర విజయం కోసం ఎంతో కృషి చేసేవారు. కైకాల సత్యనారాయణ గారి యుగం ముగిసింది’’ అని అన్నారు. భారత సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న అలాంటి ఆయనకు పద్మశ్రీ కూడా రాకపోవటంపై రిపోర్టరు ప్రశ్నించగా..
‘‘ ఇదీ మన ఖర్మ! ఒక్క సినిమాలో నటించిన వారికి పద్మశ్రీ ఇస్తోంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్వీరంగారావు గారికి ఇచ్చారా? ఆయన లాంటి నటుడు ప్రపంచంలో ఉన్నారా? ఆయనకు కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వలేదు. సావిత్రి లాంటి మహానటికి కూడా పద్మశ్రీ ఇవ్వలేదు. సత్యనారాయణ గారికి కూడా ఇవ్వలేదు. 153 సినిమాలకు దర్శకత్వం వహించిన గిన్నిస్ రికార్డు హోల్డర్ మా గురువు, దాసరి నారాయణ గారికి కూడా ఇవ్వలేదు. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.. చాలా బాధపడాలి. భారత రత్న కూడా ఎవరికి పడితే వారికి ఇస్తున్నారు. కానీ, ఎన్టీఆర్‌కు మాత్రం ఇవ్వలేదు. ఎన్టీఆర్ భారత దేశ రాజకీయాలను శాసించారు. ఈ పంపకాల యవ్వారం చాలా దారణం. ఆ దారుణంలో మనకు రావాల్సిన అవార్డులు రావటం లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.