ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, ధనంజయ్, అనసూయ భరద్వాజ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 17న పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.
తెలుగులోనే కాదు, హిందీలోను పుష్ప మంచి విజయం సాధించింది. పుష్ప హిందీ వెర్షన్ భారీగా వసూళ్లు చేసి రైట్స్ పొందిన నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. పుష్ప హిందీ వెర్షన్ కు పెద్దగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించకపోయినప్పటికీ బాలీవుడ్‌లో ఆ సినిమా 4 వారాల్లోనే సుమారు 84 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దీంతో ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
గోల్డ్ మైన్స్ టెలీఫిలింస్ కు చెందిన మనీశ్ షా, పుష్ప హిందీ హక్కులను కొన్నారు. ఆయనకు ఈ సినిమాతో కోట్లల్లోనే లాభం వచ్చిందని బాలీవుడ్ టాక్. మనీశ్ షా.. పుష్ప పార్ట్-1 రైట్స్‌ను 28 కోట్లకు కొన్నారు. డబ్బింగ్, డిజిటల్ టెక్నాలజీ తో పాటు ఇతర ఖర్చుల కోసం మరో 16 కోట్లను ఖర్చు చేశారు. అంటే పుష్ప హిందీ వెర్షన్ కోసం అతడి ఇన్వెస్ట్ మెంట్ 44కోట్ల రూపాయలు.
బాలీవుడ్ లో పుష్ప సినిమా డిస్ట్రిబ్యూటర్ షేర్ దాదాపుగా 41కోట్లు అని తేలింది. శాటిలైట్ రైట్స్‌ను 30 కోట్లకు ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు అమ్మారు. డిజిటల్ రైట్స్‌ను మరో 10కోట్లకు అమ్మేశారు. పుష్ప హిందీ వెర్షన్ కు సంబంధించిన అన్ని హక్కులను అమ్మడంతో మనీశ్ షాకు సుమారు 40కోట్ల రూపాయల లాభం వచ్చిందని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.