బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో శాండిల్ వుడ్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో విషాధ ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా పునీత్ కు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే మధ్యాహ్నాం పునీత్ రాజ్ కుమార్ మరణించారు. పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడనాడు శోకసంద్రంలో మునిగిపోయంది.
టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు పునీత్ రాజ్ కుమార్ మరణ వార్తపై స్పందించారు. ఆయనకు నివాళ్లు అర్పించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం పునీత్ రాజ్ కుమార్ యువరత్న సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా పునీత్ రాజ్ కుమార్ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు భాషకు, కన్నడ భాషకు మధ్య ఉన్న బంధాన్ని పునీత్ రాజ్ కుమార్ చెప్పారు. రెండు భాషల మధ్య రైమింగ్ తేడా ఉన్నా, శబ్ధాలు ఒకేలా ఉంటాయని అన్నారు. అందుకే తాను తెలుగు నేర్చుకున్నానని, త్వరలోనే మొత్తం తెలుగులోనే మాట్లాడతాననని చెప్పుకొచ్చారు.
తెలుగులో సినిమా చేసేందుకు తాను ఎంతో ఆసక్తిగానే ఉన్నట్టు చెప్పారు పునీత్ రాజ్ కుమార్. ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది గానీ ప్యాన్ ఇండియన్ సినిమా తీయబోతోన్నట్టు తెలిపారు. కానీ ఆ కోరిక తీరకుండానే పునీత్ రాజ్ కుమార్ అందరినీ వదిలివెళ్లారు. ఆయన బతికి ఉండుంటే ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ప్యాన్ ఇండియా సినిమా తీసేవారని అభిమానులు కన్నీళ్లుపెట్టుకుంటున్నారు.