బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్ వుడ్ నే కాదు, యావత్తు భారత దేశ సినిమా ఇండస్ట్రీని విషాదంలో ముంచింది. కర్ణాటక రాష్ట్రం అంతా కన్నీటి పర్వంతం అయ్యింది. ఇంట్లో జిమ్ చేస్తుండగా ఛాతిలో నొప్పి వచ్చిందని ఆస్పత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్, ఆ తరువాత పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. పునీత్ అకాల మరణంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు.
పునీత్ రాజ్ కుమార్ మరణంతో చాలా మంది భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే పునీత్ తన స్వఛ్చంద సంస్థ ద్వార ఎంతో మందికి సాయం చేస్తున్నారు. అందులో ప్రదానంగా అనాధాశ్రమాలు, వృధ్దాశ్రమాలు నడుపుతున్నారు. మరీ ముఖ్యంగా నిరుపేద విధ్యార్ధులకు చదువు చెప్పిస్తున్నారు. సుమారు 1800 మందికి పునీత్ రాజ్ కుమార్ తన సొంత ఖర్చులతో విద్యాదానం చేస్తున్నారు.
ఇదిగో ఇప్పుడు హఠాత్తుగా పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలన్నింటిపై నీలి నీడలు కమ్ముకున్మాయి. ఇకపై వాటిని నడిపించడం కష్టతరమే అని అంతా అనుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ పేద విధ్యార్ధులకు 1800 మందికి చదువు చెప్పిస్తున్న నేపధ్యంలో, వచ్చే యేడాది వారందరి చదువు బాధ్యత తాను తీసుకుంటానని తమిళ హీరో విశాల్ ప్రకటించారు.
ఐతే పునీత్ రాజ్ కుమార్ తాను చేస్తున్న సమాజ సేవ కోసం ఎంతో ముందు చూపుతో ఆలోచించారని ఆలస్యంగా తెలిసింది. తన ఛారిటీ ద్వార అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఎప్పటికీ ఆగిపోవద్దని పునీత్ ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. అందుకే తన ఛారిటీ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు పునీత్ రాజ్ కుమార్. ఈ 8 కోట్ల రూపాయలతో వచ్చే వడ్డీతో తాను నిర్వహిస్తున్న అన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించే విధంగా ఏర్పాటు చేశారు.
పునీత్ రాజ్ కుమార్ ముందు చూపుకు అంతా ఆశ్చర్యపోతున్నారు. తాను లేకున్నా తను మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లోను ఆగిపోకూడదని పునీత్ ఆలోచించారు. అందుకే ముందు జాగ్రత్తగా 8 కోట్ల రూపాయలను తన ఛారిటీ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు పునీత్ రాజ్ కుమార్. నిజంగా పునీత్ రియల్ హీరో కదా.