బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఇంట్లోని జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ను బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి చరలించారు. హాస్పిటల్ కు వచ్చే సరికే పునీత్ రాజ్ కుమార్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన వైద్యులు, కాసేపటి తరువాత ఆయన చనిపోయినట్లు ప్రకటించారు.
పునీత్ రాజ్ కుమార్ మరణవార్త విని కర్నాటక రాష్ట్రవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. పునీత్ రాజ్ కుమార్ మరణం నేపథ్యంలో బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పునీత్ రాజ్ కుమార్ ను చివరిసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున బెంగళూరు చేరుకుంటున్నారు. దీంతో అధికారులు బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించారు. పునీత్ రాజ్ కుమార్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం శనివారం ఉదయం బెంగళూరు కంఠీరవ స్టేడయంలో ఉంచనున్నారు.
ఆ తరువాత ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకోసం కర్నాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటోంది కర్నాటక సర్కార్. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు శనివారం తండ్రి సమాధి దగ్గరే నిర్వహించాలని నిర్ణయించారు. పునీత్ రాజ్ కుమార్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన పెద్ద కూతురు వందితా రాజ్ కుమార్ ప్రస్తుతం అమెరికాలో ఉంది.
దీంతో ఆమె ఇండియా వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల సమయానికి కూతురు వందితా బెంగళూరు చేరుకోనుందని తెలుస్తోంది. వందితా రాజ్ కుమార్ బెంగళూరు వచ్చే సరికి ఆయన అంతిమ యాత్ర ముగించి, తండ్రి రాజ్ కుమార్ సమాధి దగ్గరకు పార్ధీవ దేహం చేరుకుంటుందని కుటుంబ సబ్యులు తెలిపారు. కూతురు అక్కడికి చేరుకోగానే పునీత్ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారని చెప్పారు.