బిజినెస్ డెస్క్- డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఈ డైలాగ్ తరుచూ మనకు టీవీ వ్యాపార ప్రకటనలో వినిపిస్తుంది. నిజమే మరి.. నిజంగానే డబ్బులు ఎవరి ఊరికే రావు. ఎంతో కష్టపడితే గాని డబ్బులు రావు కదా. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో ఓ మార్గం స్టాక్ మార్కెట్. అవును స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి చాలా మంది బాగా సంపాదిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ పై అందరికి ఆసక్తి పెరుగుతోంది. ప్రధానంగా యువత స్టాక్ మార్కెట్‌పై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఐతే కొన్ని స్టాక్స్ నష్టాల్లో వెళ్తుంటే, మరి కొన్ని స్టాక్స్ మాత్రం అతి కొద్ది సమయంలోనే కనీవినీ ఎరుగని లాభాలను ఇస్తున్నాయి. కేవలం ఏడాది వ్యవధిలోనే పదింతల మేర కొన్ని స్టాక్స్ ధరలు పెరుగుతున్నాయి. అలాంటి స్టాక్స్‌లో ఒకటే ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్. ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ తన ఇన్వెస్టర్లకు గత 9 నెలల్లోనే 5,734 శాతం రిటర్నులను అందజేసిందంటే నమ్మశక్యంగా లేదు.
ఈకేఐ మల్టి బ్యాగర్ స్టాక్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 140 రూపాయలుగా ఉంటే, ప్రస్తుతం ఈ స్టాక్ బొంబై స్టాక్ ఎక్స్చేంజ్‌లో 8,576.60 రూపాయలుగా పలుకుతోంది. దీంతో గత 9 నెలల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు ఏకంగా 58 లక్షల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయన్నమాట. ఈ మంగళవారం ట్రేడింగ్ లో ఈకేఐ కంపెనీ స్టాక్ 5 శాతం మేర పెరిగి, ఇన్వెస్టర్లు లాభాల వర్షం కురిపించింది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈకేఐ స్టాక్ ఈ ఏడాది ఏప్రిల్ లోనే మార్కెట్‌లో లిస్టు అయ్యింది. 102 రూపాయ వద్ద లిస్టైన ఈ షేరు, కేవలం సంవత్సరం వ్యవధిలోనే ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. మంగళవారం ఈ స్టాక్ బీఎస్ఈలో 8,576.60 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,614.82 కోట్లుగా ఉంది. 2011లో ప్రారంభమైన ఈ కంపెనీ, భారత్‌లో కార్బన్ క్రెడిట్ ఇండస్ట్రీలో అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా ఉండటం విశేషం.