విద్యా వ్యవస్థ నేడు పూర్తిగా వ్యాపారమైంది. బడిలో సీటు వచ్చే దగ్గర నుండి పూర్తయ్యే వరకు అంతా డబ్బుమయం. ఈ ప్రైవేటు స్కూల్స్ సైతం ఓ రకమైన దందాను తెరలేపుతున్నాయి. డొనేషన్ నుండి స్కూల్ యూనిఫాం, బుక్స్ వరకు తమ వద్దే కొనాలన్న ఖచ్చితమైన రూల్స్ తెస్తున్నాయి. లేదంటే విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఓ ప్రైవేట్ స్కూల్ ఓ విద్యార్థిని పట్ల ఏం చేసిందంటే..?
చదువు ఇప్పుడు పూర్తిగా వ్యాపారంతో కూడుకున్నదైంది. ప్రభుత్వ బడుల్లో చెప్పే పాఠాలతో చదువులు అబ్బడం లేదన్న అపోహతో ఉన్న తల్లిదండ్రులు ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగిపోవడం.. ప్రైవేటు బడులకు డిమాండ్ పెరిగిపోవడంతో, అవి కూడా నెలకొకటి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు కాకుండా వ్యాన్ ఫీజని, యూనిఫాం ఫీజని, పుస్తకాల ఇక్కడే కొనాలని ఓ రకమైన దందాను షురూ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్ యజమానులు. వీటిల్లో ఏదీ చెల్లించకపోయినా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. లేదంటే పిల్లలపై ప్రతాపాలు చూపిస్తున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలో రాజన్న సిరిసిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ఓ విద్యార్థిని పట్ల చాలా దారుణంగా వ్యవహరించింది. తంగళ్ల పల్లి మండల కేంద్రంలో శుభోదయ అనే ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది కందికట్ల ఉషశ్రీ అనే బాలిక. అయితే ఆమె స్కూల్ బస్సు చెల్లించకపోవడంతో బాలికను మార్గమధ్యంలో దింపేశారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటన జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) దృష్టికి చేరింది. అయితే ఈ ఘటనపై తీసుకునే చర్యలు నామమాత్రం ఉండేలా చూసేందుకు పలువురు ప్రైవేట్ పాఠశాలల యజమానులు రంగంలోకి దిగినట్లు సమాచారం.ఈ ఘటనపై స్థానికులు, ఉషశ్రీ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాన్ ఫీజు చెల్లించని కారణంగా బాలికను దింపేసిన శుభోదయ పాఠశాలపై కఠిన చర్యలు చేపట్టేలా చూడాలని కోరారు.