ఉత్తర ప్రదేశ్- సమాజంలో పైశాచికాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని బాలికలపై కొందరు దుర్మార్గులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. దీంతో పిల్లలను స్కూల్ కు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా, పిల్లలు, ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు.
కొందరు ఉపాద్యాయులు సైతం ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే కామాంధులుగా మారుతున్నారు. పరీక్షల పేరుతో పాఠశాలకు పిలిచి విద్యార్థినులపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కీచకుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోర సంఘటన ఉత్తర ప్రదేశ్ లో నవంబర్ 17న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ముజఫర్ నగర్ లోని పుర్కాజి ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ పరీక్షల పేరుతో పదో తరగతి చదువుతున్న 17 మంది బాలికలను పాఠశాలకు పిలిపించాడు. మరుసటి రోజు సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయని రాత్రంతా అక్కడే ఉండాలని వారికి చెప్పాడు. విద్యార్థినిల కోసం భోజనం తయారు చేసే సమయంలో అందులో మత్తు మందు కలిపి, విద్యార్థినులచేత తినిపించాడా ప్రిన్సిపల్.
మత్తు మందు కలిపిన ఆహారం తిన్న విద్యార్థులు స్పృహ కోల్పోవడంతో ప్రిన్సిపల్ తో పాటు అతని సహచరుడు విధ్యార్ధినులపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని, చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేయడంతో పాటు, వారి కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారు. బాధిత విద్యార్ధినులంతా పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇంటికి వెళ్లాక కూడా ఎవరు నోరు మెదపలేదు.
ఇద్దరు బాలికలు మాత్రం ధైర్యం చేసి జరిగిన దారుణం గురించి వారి తల్లిదండ్రులకు చెప్పారు. విధ్యార్ధినుల తల్లిదండ్రులు పుర్కాజి ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వాల్ ను ఆశ్రయించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఎస్పీ అభిషేక్ యాదవ్‌ను ఎమ్మెల్యే కోరారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రిన్సిపల్ తోపాటు అతని సహచరుడిపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.