హైదరాబాద్- ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ తరపున వ్యూహాలు రచించేందుకు ప్రశాంత్ కిశోర్ అస్త్రశస్త్రాలు సిద్దం చేస్తున్నారు. ఈమేరకు ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పీకే ఎత్తులు వేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ప్రశాంత్ కిశోర్ తన బృందంతో పాటు హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భవిష్యత్ వ్యూహాలపై సుదీర్ఘ మంతనాలు జరిపారని సమాచారం. దేశ రాజకీయాలు, ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యుహాలపై ఇద్దరూ చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ తోనూ సమావేశమయ్యారు. ఈ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి.. పీకేతో పంచుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలతో కూటమి కడితే ఎలా ఉంటుందన్న అంశంపైనా చర్చించినట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ వెంట సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఉన్నారు. కేసీఆర్ సూచన మేరకు ప్రశాంత్ కిశోర్, ప్రకాశ్ రాజ్‌తో కలిసి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ను సందర్శించారు.
ఐతే పీకే టీం మల్లన్న సాగర్ పర్యటనను టీఆర్ ఎస్ వర్గాలు, అధికారులు రహస్యంగా ఉంచారు. తెలియనివ్వలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ప్రశాంత్ కిశోర్ సర్వే ప్రారంభించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే సర్వే ప్రారంభించినట్లు సమాచారం.
టీఆర్‌ఎస్ పాలన, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారన్న కోణంలో సర్వే సాగుతోందట. టీఆర్ ఎస్ కు ఏ పార్టీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారనే అంశాన్ని ప్రజల నుంచి తెలుసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దళిత బంధు పధకం అమలు తీరు తదితర అంశాలపై పీకే టీం సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది.