టాలీవుడ్ జేమ్స్ బాండ్ ఘట్టమనేని కృష్ణ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. సినీ ప్రముఖులు, ఉద్ధండులు ఒక్కొక్కరిగా కృష్ణ భౌతిక దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, జూ.ఎన్టీఆర్, మోహన్‌బాబు, రాజేంద్ర ప్రసాద్, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు ప్రముఖులు నానక్‌రామ్ గూడలోని కృష్ణ స్వగృహానికి వెళ్లారు. అక్కడ కృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించటంతో పాటు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్.. కృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ప్రభాస్ వెంట ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు.
కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ సోమవారం ఉదయం గుండె పోటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అక్కడి వైద్యులు అత్యవసర విభాగంలో ఆయనకు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఉదయం కుటుంబసభ్యులు ఆయన భౌతిక దేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ప్రముఖుల సందర్శన కోసం ఉంచారు. ప్రముఖుల సందర్శన అనంతరం ఈ సాయంత్రం 5 గంటలకు గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కృష్ణ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.