ఇటీవల తెలంగాణలో ప్రముఖులు మరణించడం కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చంద్ గుండె పోటుతో మరణించిన సంగతి విదితమే.
ఇటీవల తెలంగాణలో ప్రముఖులు మరణించడం కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయి చంద్ గుండె పోటుతో మరణించిన సంగతి విదితమే. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలైన కుసుమ జగదీష్, నందగిరి మహేందర్ రెడ్డి మృతి చెందారు. ఈ ముగ్గురు కూడా గుండె పోటు కారణంగా మృత్యువాత పడ్డారు. తాజాగా పటాన్ చెరు ఎమ్మెల్యే కుమారుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన తర్వాత చికిత్స పొందుతూ.. హార్ట్ స్ట్రోక్ రావడంతో తుది శ్వాస విడిచారు. ఈ మరణ వార్తలు మర్చిపోకముందు ప్రముఖ గాయకుడు ఒకరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారన్న చేదు వార్త వినిపిస్తోంది.
తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలోలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజులుగా ఆయన ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. కాగా, ఆయన్ను జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కలిసి పరామర్శించారు. దాదాపు అరగంట పాటు గద్దర్‌తో సంభాషించినట్లు తెలుస్తోంది. పవన్‌కు గద్దర్ అన్నా, ఆయన పాటలన్నా చాలా అభిమానం. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని బహిర్గతంగానే చెప్పారు. ఇప్పుడు ఆయనకు బాగోలేదని తెలిసే సరికి వచ్చి ఆయన్ను కలిసి పరామర్శించారు. గద్దర్ త్వరగా కోలుకుని రావాలని పవన్ ఆకాంక్షించారు. కాగా, ఏ అనారోగ్య సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో తెలియరావాల్సి ఉంది. అయితే గతంలో కేఏపాల్ పార్టీ ప్రజా శాంతిలో చేరిన గద్దర్.. దాని నుండి బయటకు వచ్చి సొంత పార్టీని ఏర్పాటు చేసిన సంగతి విదితమే.