ఇంటర్నేషనల్ డెస్క్- తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించాక.. ఆ దేశం నుంచి పారిపోయేందుకు ప్రముఖుల నుంచి మొదలు సామాన్యుల వరకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ఆప్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అందరికంటే ముందుగానే పారిపోయాడు. అక్కడే ఉంటే ఏక్షణంలోనైనా తాలిబన్ల చేతిలో మరణం తప్పదని అంతా భయంతో వణికిపోతున్నారు. అందుకే తప్పించుకునేందుకు ఉన్న ఏకైక మార్గమైన విమానాశ్రయానికి జనం పోటెత్తారు.
అఫ్గాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయంలో ఇటీవల కనిపించిన ఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అంతకు ముందు అమెరికా వాయుసేన విమానంలో ఏకంగా వెయ్యి మంది కిక్కిరిసి ప్రయాణించిన ఘటనను మనం చూశాం. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ పాప్‌స్టార్ ఆర్యన సయీద్ కూడా దేశాన్ని విడిచి అమెరికా విమానంలో కాబూల్‌ను విడిచి పారిపోయింది.
ఆఫ్ఘనిస్థాన్ లో ప్రముఖ పాప్ స్టార్ అయిన ఆర్యన మంచి గాయని కూడా. ఆఫ్ఘన్‌లో తాలిబన్ ప్రభుత్వం అరాచకాల నేపధ్యంలో అమెరికా కార్గో జెట్ విమానంలో ఆర్యాన పారిపోయింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తాను తప్పించుకుని వెళ్లిపోయిన సంగతిని ఆమె అభిమానులకు తెలియజేసింది. కార్గో జెట్ విమానంలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఆర్యాన సయీద్.
రెండు భయంకరమైన రాత్రులు చూశానని, నేను ప్రాణాలతో ఉన్నాను, దోహా చేరుకున్నా, ఇస్తాంబుల్ వెళ్లే విమానం కోసం ఎదురుచూస్తున్నాను.. అని సోషల్ మీడియా ద్వార చెప్పింది. నేను ఇంటికి చేరుకుని షాక్ నుంచి తేరుకుని మనసు స్థిమితపడ్డాక మీతో పంచుకునేందుకు బోల్డన్ని విషయాలున్నాయని చెప్పుకొచ్చింది. ఫోటోలో ముఖానికి మాస్క్ పెట్టుకుని విమానంలో నిద్రపోతున్నట్లు కనిపించింది ఆర్యాన.