పెద్దపల్లి- ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్, అందాల భామ పాయల్ రాజ్ పుత్ వివాదంలో చిక్కుకుంది. కరోనా నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న పాయల్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాయల్ రాజ్ పుత్ పోలీసు కేసులో ఇరుక్కుంది. పాయల్ రాజ్‌పుత్‌తో పాటు మరికొందరిపై తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెద్దపల్లిలో పోలీసు కేసు నమోదైంది.
పెద్దపల్లి పట్టణంలో గతనెల 11వ తేదీన వెంకటేశ్వర షాపింగ్ మాల్ ను ప్రారంబించింది పాయల్ రాజ్ పుత్. ఐతే షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్బంగా పాయల్ రాజ్‌పుత్, షాపు యాజమాన్యం మాస్కులు ధరించ లేదు. అంతే కాదు కనీసం భౌతిక దూరం కూడా పాటించ లేదు. షాపింగ్ మాల్ ప్రారంభం సందర్బంగా పెద్ద ఎత్తున జనం కూడా గుమిగూడారు.
దీంతో పాయల్ తో పాటు షాపింగ్ మాల్ యాజమాన్యం కరోనా నిబంధనలను ఉల్లంఘించారని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ బాబ్జీ న్యాయవాది డొంకెన రవి ద్వారా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పాయల్ రాజ్‌పుత్, షాపింగ్ మాల్ యజమాని వెంకటేశ్వర్లు, అతడి భార్య మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ జూనియర్ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలైంది.
ఈ పిటీషన్ పై విచారించిన జూనియర్ సివిల్ కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని పెద్దపల్లి పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పాయల్ తో పాటు షాపింగ్ మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పెద్దపల్లి పోలీసులు తెలిపారు.