మధ్యప్రదేశ్- మంచి పని చేయాలంటే ఒకటి రెండు మార్గాలే ఉంటాయి. కానీ చెడు పని చేయాలంటే మాత్రం ఎన్నో మార్గాలుంటాయని నిరూపించారు స్మగ్లర్లు. మామూలుగా గంజాయి రవాణా చేస్తే పోలీసులకు పట్టబడిపోతున్నామని వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఈ సారి ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ద్వార రవాణా మొదలుపెట్టారు గంజాయి స్మగ్లర్లు.
గంజాయి సరఫరాపై పోలీసుల నిఘా పెరగడంతో స్మగ్లర్లు రూటు మారుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ను అడ్డాగా చేసుకుని విక్రయాలు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన పోలీసులు, గంజాయి స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అమెజాన్ గ్వాలియర్ రెండు డెలివరీ హబ్ ల ద్వారా డ్రై స్టీవియా పేరిట గంజాయి విక్రయాలు చోస్తున్నారు. స్టీవియా అనేది చక్కెరకు ప్రత్యామ్నాయం.
గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, డయాబెటీస్ ఉన్న వారు టీ, కాఫీల్లో, స్వీట్లలో స్టీవియాను ఉపయోగిస్తుంటారు. ఇలా ఇప్పటి వరకు డ్రై స్టివియా పేరుతో 1.10 కోట్ల విలువ చేసే గంజాయిని అమెజాన్ లో దుండగులు అమ్మేశారు. గ్వాలియర్ పోలీసులు శనివారం ఈ ముఠాకు చెందిన కల్లు పవయ్య, బ్రిజేంద్ర తోమర్‌లను అరెస్టు చేసి, 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కళ్లు గప్పేందుకు, వారి నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు అమెజాన్ ను ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు. గంజాయి కావాల్సిన వారు మాత్రమే దాన్ని కొనుగోలు చేసేవారని నిర్ధారణకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఏజెన్సీ నుంచి దుండగులు ఈ కామర్స్, కొరియర్ సంస్థల ద్వారా గంజాయిని గ్వాలియర్, భోపాల్, కోటా, ఆగ్రా నగరాలకు తరలిస్తున్నారని పోలీసులు గుర్తించారు. 1.10 కోట్ల విక్రయాల్లో సుమారు 66 లక్షలు అమెజాన్ కు కమీషన్ రూపంలో దక్కాయని పోలీసులు తెలిపారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 20 బీ ప్రకారం అమెజాన్ అధికారులు కూడా శిక్షార్హులేనని పోలీసులు చెప్పారు.