అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఏపీలో వానలు కురుస్తున్న నేపథ్యంలో మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రధాని, జగన్ ను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా సాయమందిస్తామని ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో వరద ప్రభావ ప్రాంతాల్లో ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఇక ఏపీలో కరుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం స్థంబించి పోయింది. కడప జిల్లా రాజంపేట వరదల్లో 12 మంది జల సమాధి అయ్యారు. చిత్తూరు జిల్లాలోనూ భారీగా వానలు కురుస్తున్నాయి. తిరుమల కొండపైన వరద బీభత్సం నెలకొంది. తిరుపతి నగరంలో అనేక కాలనీలు నీట మునిగాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి గన్నవరం తిరిగి వస్తారు. ఏరియల్ సర్వేకు బయలుదేరే ముందు సీఎం వైఎస్ జగన్, ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారి తో మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను. ఈ సమయంలో అందరూ సురక్షితంగా, భద్రంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
— Narendra Modi (@narendramodi) November 19, 2021