ఫిల్మ్ డెస్క్- పెళ్లి సందడి సినిమా గుర్తుంది కదా. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. శ్రీకాంత్ హీరోగా, రవళి, దీప్తీ భట్నాగర్ హీరోయిన్లుగా నటించిన పెళ్లి సందడి ఓ క్లాసికల్ హిట్. అచ్చతెలుగు వివాహ వేడుకను, ప్రేమను రంగరించి రూపొందించిన కధతో రాఘవేంద్ర రావు తీసిని పెళ్లి సందడి నిజంగానే సినీ పరిశ్రమలో సందడి చేసింది.
ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు కే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో మళ్లీ పెళ్లిసందD వస్తోంది. రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాకు గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు చిత్ర బృందం పెళ్లిసందD మూవీ టైటిల్ గీతాన్ని విడుదల చేసింది. ఈ లిరికల్ వీడియో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.
పట్టుచీరల తళతళలు, పట్టగొలుసుల గలగలలు.. అంటూ సాగే ఈ పాట చిత్రీకరణ బావుంది. పెళ్లిసందడి అంటే ఇలా ఉండాలి అనేలా ఈ పాట ఉంది. హీరో, హీరోయిన్లతో పాటు చాలా మంది సీనియర్ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. పాట ఆద్యంతం రోషన్, శ్రీలీల డ్యాన్సులు, అందమైన సెట్లు అలరించాయి. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు.
యువ గాయకులు హేమచంద్ర, దీపు, రమ్య బెహర ఈ పాటను పాడారు. అన్నట్లు ఈ పెళ్లిసందD కి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాతో నటుడిగా మారుతున్నారు. అవును ఈ మూవీలో రాఘవేంద్ర రావు కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న పెళ్లిసందD త్రవలోనే విడుదలకు సిద్దమవుతోంది.