అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల వివాదం అంతకంతకు ముదురుతోంది. జగన్ సర్కార్ సినిమా ధియోటర్స్ లో టిక్కెట్స్ ధరను తగ్గించడంపై సినీ పరిశ్రమలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పుడీ సినిమా టిక్కెట్ల అంశం రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. జనసేన అధినేత, పవర్ స్టార్ వవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.
జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారని పవన్ ఆరోపించారు. పంతానికి దిగితే ఆంధ్రప్రదేశ్‌లో తన సినిమాలు ఉచితంగా చూపిస్తానని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, భూ నిర్వాసితులకు మద్దతుగా ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది.
పార్టీ నేతలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై ఫైర్ అయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బకొట్టడం ద్వారా తన ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలని చూస్తున్నారని పవన్ ఆరోపించారు. తన సినిమాలు ఆపేసి, ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో తన సినిమాలు ఆపేసినా భయపడేది లేదని పవన్ తేల్చి చెప్పారు.
పంతానికి దిగితే ఆంధ్రప్రదేశ్‌లో తన సినిమాలు ఉచితంగా చూపిస్తానని సవాల్ విసిరారు. సినిమా టికెట్లకు పారదర్శకత లేదంటున్నారని, మీరు అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా అని జగన్ సర్కార్ ను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో 700కు మద్యం కొనండి, 5 రూపాయలతో సినిమాకు వెళ్లండి.. అంటూ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయని, ప్రజలు వీటిపై తిరగబడాలని పవన్ పిలుపునిచ్చారు.