చెన్నై- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారం చేపట్టాక మంచి పరిపాలన కొనసాగిస్తున్నారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిపక్షాలను సైతం కలుపుకుపోతూ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారని స్టాలిన్ పై అంతా ప్రసంశలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు.
అధికారంలోకి వచ్చాక చాలా మంది రాజకీయం చేస్తారని. కానీ ఎన్నికల సమయంలోనే రాజకీయం చేయాలి, పాలనా పగ్గాలు చేపట్టాక ప్రజా రంజక పరిపాలనపైనే దృష్టి పెట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిరూపించారని పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈమేరకు ఆయన స్టాలిన్ ను ట్విట్టర్ వేధికగా అభినందించారు. స్టాలిన్ తమిళనాడును చాలా బాగా పరిపాలిస్తున్నారని పవన్ చెప్పారు.
ఐతే పవన్ కళ్యాణ్, తమిళనాడు సీఎం స్టాలిన్ ను మెచ్చుకున్న రెండు రోజుల తరువాత మెగాస్టార్ చిరంజీవి నేరుగా స్టాలిన్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి బుధవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. చెన్నైలోని తేనాంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చిరంజీవి, స్టాలిన్‌తో సమావేశమయ్యారు. భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినందుకు ఈ సందర్భంగా చిరంజీని స్టాలిన్ ను అభినందించారు.
చెన్నై విచ్చేసి తనకు అభినందనలు తెలిపిన చిరంజీవికి స్టాలిన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీలో స్టాలిన్ తనయుడు, ట్రిప్లికేన్ చేపాక్ ఎమ్మెల్యే ఉదయనిధి సైతం పాల్గొన్నారు. మరోవైపు ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకమేనని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఏదేమైనా స్టాలిన్ ను పవన్ పొగడటం, చిరంజీవి కలవడం మాత్రం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT
— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021