ఫిల్మ్ డెస్క్- భిమ్లా నాయక్.. పరవ్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన తాజా సినిమా. ఈనెల 25న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్బంగా బుధవారం భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మునిసిపాలిటీ మంత్రి కేటీఆర్ ముఖ్య అథిధిగా విచ్చేశారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా చాలా కూల్ గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జై తెలంగాణ, జై ఆంధ్ర నినాదంతో స్పీచ్ మొదలుపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి.. కర్ణాటక, చెన్నై, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. ఈ ఈవెంట్‌కి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు.. వాళ్లందరికీ మనస్పూర్తిగా క్షమించమని కోరుతున్నా.. భీమ్లా నాయక్ ఆడియో ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన కేటీఆర్ గారికి ధన్యవాదాలు.. అని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఇమడవు.. కళాకారులు ఉండే చోటు ఇది.. నిజమైన కళాకారులకు కులమతాలు ఉండవు. నేను జన జీవితంలో ఉన్నా కానీ.. నాకు సినిమా అనేది అన్నం పెట్టింది.. సినిమా లేకపోతే నాకు ఉనికి లేదు.. సినిమా ఇచ్చిన భిక్ష ఈ అభిమానం.. వాళ్ల కోసం ఎంతో కొంత చేయాలని నాకు ఉంది. నాకు సినిమా తప్ప ఏమీ లేదు.. రాజకీయాలు ఉన్నాసరే సినిమాని చాలా బాధ్యతగా చేస్తున్నా.. అలాగే ఈ సినిమాని కూడా బాధ్యతగానే చేశాం. మనసు పెట్టి చేసిన సినిమా ఇది.. అని పవన్ కళ్యాణ్ అన్నారు.
భీమ్లా నాయక్ సినిమా అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య నడిచే మడమతిప్పని యుద్దం. మలయాళ చిత్రానికి రీమేక్ ఇది. ఈ సినిమాకి మూలాధారం త్రివిక్రమ్. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. డానియేల్ శేఖర్‌గా నటించిన రానా అద్భుతమైన సహకారం అందించారు. నిత్యా మీనన్, సంయుక్త అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమా మీకు నచ్చేవిధంగా ఉంటుంది. నా సినిమాను నేను ఎప్పుడూ ప్రమోట్ చేసుకోను. నా కర్తవ్యం బాగా చేయడమే.. ఎలా ఆదరించాలన్నది నేను ఎప్పుడూ చెప్పలేదు.. మీరు ఆదరించి ఆనందపరిస్తే సంతోషపరుస్తుందని కోరుకుంటున్నా.. జై హింద్.. అని చెప్పారు పవన్ కళ్యాణ్.