ఆడవాళ్లపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబందించి పుట్టుకొచ్చిన ఉద్యమం మీటూ. దీన్ని వేదికగా చేసుకుని అనేక మంది మహిళలు తమ గళాన్ని విప్పుతున్నారు. అనేక సందర్భాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ప్రముఖులు సైతం తమ వేదనను వెలిబుచ్చుతున్నారు. నటి, బీజెపీ నేత ఖుష్బు, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ వంటి వారు చిన్న వయస్సులో ఎదుర్కొన్న వేధింపులను చెప్పారు. ఇప్పుడు ఆ జాబితాలో ఓ అధికారిణి చేరింది.
తల్లి, సోదరి, వదిన, అత్త, నాన్నమ్మ ఎవరైనా సరే ఆడదైతే చాలు.. తమ కామ వాంఛను తీర్చుకునే వస్తువులుగా చూస్తున్నారు మగవాళ్లు. ఎన్ని చట్టాలు వచ్చినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అయితే ఇటీవల మీటూ ఉద్యమం వచ్చాక అనేక మంది మహిళలు తమ గళాన్ని విప్పుతున్నారు. ఇప్పుడిప్పుడే అనేక సందర్భాల్లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. అయితే ఊహించని విధంగా ప్రముఖులు సైతం తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు. అయితే వీరు మైనర్లుగా ఉన్నసమయంలో ఈ వేధింపులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన తండ్రి చేతుల్లోనే తాను లైంగిక వేధింపులకు, హింసకు గురైనట్లు నటి కుష్బు సుందర్ తో పాటు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌లు సైతం తమ వేదనను వెళ్లగక్కారు. తాజాగా మరో మహిళా అధికారి తాను ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
ఆరేళ్ల వయసులో ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని కేరళలోని పతనంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్ తెలిపారు. మంగళవారం మీడియా ప్రతినిధుల కోసం శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన వర్క్‌షాప్‌లో దివ్య పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఇద్దరు మగవాళ్ళు నన్ను ప్రేమగా పిలిచి, వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకున్నారు. నాపై ప్రేమ కురిపిస్తూ.. ఒళ్లంతా తడుముతున్నారు. అంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్ధం కాలేదు. వాళ్ళు నా డ్రెస్ తీసేసినప్పుడు ఇబ్బందిగా అనిపించింది. నేను వెంటనే అక్కడి నుండి పారిపోయాను’ అని అయ్యర్ ఆమె భయంకరమైన విషయం గురించి చెప్పారు. తల్లిదండ్రులు అందించిన సహకారంతో ఆమె ఆ బాధ నుంచి బయటపడగలదని కలెక్టర్ చెప్పారు.
తరువాత తాను బయటకు వెళ్లిన ప్రతిసారి చుట్టూ చూసేదానినని, గుంపులుగా ఉన్న చోట వారిద్దరూ తారసపడతారేమోనని భయపడేదానని దివ్య పేర్కొన్నారు. అందుకే పిల్లలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పిల్లలు సీతాకోక చిలుకల్లా ఆడిపాడాల్సిన వయసులో అలాంటి అనుభవాలు రాకుండా ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేయాలని దివ్య పిలువునిచ్చారు. కాగా, దివ్య వైద్యురాలు కూడా. తిరువనంతపురానికి చెందిన ఆమె.. పతనం తిట్ట జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, దివ్యను ఒక జాతీయ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన జిల్లా మేజిస్ట్రేట్‌లకు ‘ఎక్సలెన్స్ ఇన్ గుడ్ గవర్నెన్స్ అవార్డు’తో సత్కరించింది. ఆమె అరువిక్కర మాజీ ఎమ్మెల్యే కెఎస్ శబరినాధన్‌ను వివాహం చేసుకున్నారు.