మన దేశంలో కరోనా కాలంలో చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో జరిగిన మోసాలు చాలానే ఉన్నాయి. కానీ.., వీటిలో బయట పడింది మాత్రం కొన్నే. ఇప్పుడు తాజాగా హాస్పిటల్స్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ఉంది. ఏప్రిల్ 26న ఈ ఆసుపత్రి 96 మంది కరోనా రోగులు ఆక్సిజన్ బెడ్స్పై ఉన్నారు. ఆక్సిజన్ కొరత మాత్రం ఎక్కువగా ఉంది. అప్పటికే ఆ హాస్పిటల్స్ కి కొత్త కేసులు వస్తున్నాయి. ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో లేవు. మరీ అంత సీరియస్ గా లేని వారిని బెడ్స్ ఖాళీ చేయమంటే వారు చేయలేదు. నిజానికి ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితే. ఇలాంటి సందర్భంలో కోలుకుంటున్న వారికి నయానో, భయానో నచ్చచెప్పి.., అత్యవసరమైన వారికి ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేస్తే సరిపోద్ది. కానీ.., ఆ హాస్పిటల్ యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నాడు. ఏప్రిల్ 26వ తారీఖున ఉదయం 7 గంటల సమయంలో ఓ ఐదు నిమిషాల పాటు రోగులందరికీ ఆక్సిజన్ సరఫరాను నిలిపి వేయించాడు. ఫలితంగా 22 మంది రోగుల పరిస్థితి ఐదు నిమిషాల్లోనే విషమించింది. వాళ్ల శరీరం నీలం రంగులోకి మారిపోయింది. దీంతో వెంటనే ఆక్సిజన్ సరఫరాను ఆ 22 మందికి పునరుద్ధరించారు. మిగిలిన 74 మందికి ఆక్సిజన్ లేకపోయినా కూడా తీవ్ర ప్రమాదం లేదని నచ్చచెప్పి వారికి మామూలు బెడ్స్ కేటాయించారు.
ఆక్సిజన్ అవసరం ఎవరికి ఉందో తెలుసుకునేందుకు ఓ మాక్ డ్రిల్ గా దీన్ని ప్లాన్ చేసుకున్నాడు డాక్టర్ అరింజయ్. ఈ చర్యని అతను సమర్ధించుకున్నాడు కూడా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దీంతో ఈ చర్య కాస్తా తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీంతో.., ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఓ కమిటీని నియమించింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. నిజానికి ఆ ఘటన జరిగిన రోజు ఆసుపత్రిలో 22 మంది మరణించారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆసుపత్రి యాజమాన్యం మాత్రం వాటిని కొట్టి పారేస్తోంది. ఏప్రిల్ 26న తమ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల నలుగురు మాత్రమే చనిపోయారని స్పష్టం చేస్తోంది. కానీ.., వీరి దగ్గర కరోనా మరణాలకు సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డ్స్ లేవు. కానీ.., ఇక్కడ ఓ ప్రత్యక్ష సాక్షి చెప్తున్న మాటలు అందరికీ షాక్ కలిగిస్తున్నాయి. ఆ సాక్షి పేరు మయాంక్ చావ్లా. “ఏప్రిల్ 26వ తారీఖున ఇదే హాస్పిటల్ లో మా తాతయ్య చనిపోయారు. అదే రోజు మరికొంత మంది రోగులు కూడా ఆక్సిజన్ లేక చనిపోయారు. ఆసుపత్రి యాజమాన్యమే ఆక్సిజన్ను ఐదు నిమిషాలు ఆపేయండని ఆదేశాలు ఇవ్వడం చూసి నేను షాకయ్యాను. ఆ ఐదు నిమిషాలు ఆక్సిజన్ లేకపోవడం వల్ల 22 మంది కరోనా పేషెంట్ల పరిస్థితి విషమించింది. అది ఓ రకంగా హత్యే. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ మయాంక్ చావ్లా ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేయడంతో.. అసలు నిజాలు త్వరలోనే బయటపడనున్నాయి. మరి.., ఈ వ్యవహారంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.