కరోనా కోరల్లో చిక్కి తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. ఆస్తులు, ఆప్తులను కోల్పోయిన కుటుంబాలు సాయం కోసం దిక్కులు చూస్తున్నాయి. కొవిడ్‌తో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను దత్తత తీసుకునేందుకు యువజంటలు ముందుకొస్తున్నారు. ఆన్‌లైన్,ఆఫ్‌లైన్, ఫోన్‌కాల్స్ ద్వారా తమ ఆసక్తిని పంచుకుంటున్నారు. దీన్ని అవకాశం చేసుకుని పిల్లల్ని దత్తత చేసుకుంటామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు పుట్టుకొచ్చాయి. సాయం చేస్తామంటూ సామాజిక మాధ్యమాల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న మాయగాళ్లు పేట్రేగిపోతున్నారు.
కొవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లలను చట్ట విరుద్ధంగా దత్తత ఇచ్చే, తీసుకొనే ప్రయత్నాలను గట్టిగా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. అలాంటి వ్యక్తులపై, స్వచ్ఛంద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఎల్.నాగేశ్వర్‌రావు, జస్టిస్ అనిరుధ్‌బోస్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది. కొవిడ్ కారణంగా అనాథలైన పిల్లల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో గానీ మరోచోట గానీ బయటపెట్టరాదని, ఫలానా పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని విజ్ఞప్తులు చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు 18 పేజీల మార్గదర్శకాలను విడుదల చేసింది. అనాథ పిల్లల పేర్లను వెల్లడిస్తూ వారి కోసం స్వచ్ఛంద సంస్థలు చందాలు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. అనాథలుగా మారిన లేదా తల్లిదండ్రులను కోల్పోయిన లేదా విడిచిపెట్టిన మైనర్ల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం అనాథలను దత్తత తీసుకోవటానికి ఆహ్వానించడం చట్ట విరుద్ధమని పేర్కొంది. సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ప్రమేయం లేకుండా దత్తత తీసుకోవటానికి అనుమతి లేదని తెలిపింది.