చెన్నై- దేశవ్యాప్తంగా కరోనా తగ్గు ముఖం పడుతోంది. కొవిడ్ కేసుల సంఖ్య అంతకంతకు తగ్గుతోంది. ఐతే కరోనా జంతువులపై ప్రభావం చూపుతోంది. దేశంలో పలు చోట్ల జంతువులు కరోనా బారిన పడుతున్నాయి. తమిళనాడుతోని చెన్నైలో వండలూరు జూ పార్కులో కొన్నాళ్ల క్రితం ఓ సింహం కరోనా బారిన పడి చనిపోయిన ఘటన మరవకముందే మరో సింహం కోవిడ్ తో మృతి చెందింది. జూలోని 12 ఏళ్ళ ఈ సింహానికి ఈ నెల 3 న కరోనా పాజిటివ్ సోకడంతో అప్పటి నుంచి దీనికి ప్రత్యేక ఐసొలేషన్ లో ఇంటెన్సివ్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
పథభనాథన్ అని పిలిచే ఈ సింహం ఈ ఉదయం 10 గంటల 15 నిముషాల సమయంలో చనిపోయింది, ఈ సింహాన్ని రక్షించేందుకు జూ పార్క్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. ఈ సింహం రక్తం నమూనాలను భోపాల్ లోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ కి పంపగా అప్పుడే దీనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గత కొన్ని రోజుల ముందే ఈ జూ పార్కులో ఓ సింహం కరోనా బారిన పడి చనిపోయింది. జూలోని జంతువుల బాగోగుల పట్ల వెటర్నరీ డాక్టర్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండాపోతోందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడి సఫారీ పార్కులో ఉన్న మరో ఐదు సింహాలు తరచూ దగ్గుతున్నాయి.
మే 26 నుంచి అనారోగ్యానంతో ఉన్న ఈ సింహాల పట్ల వెటర్నరీ వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూ పార్క్ లోని మొత్తం 11 సింహాల రక్త నమూనాలను, వాటి నాసల్ శ్వాబ్ ను భోపాల్ లోని ల్యాబ్ కు పంపినట్టు అధికారులు చెప్పారు. గత ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఈ జూను సందర్శించారు. జూ పార్క్ లోని జంతువుల పరిస్థితిని ఆయన సమీక్షించారు. సింహాల వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీవహించాలని, వాటి వైద్య చికిత్సలో ఎలాంటి లోపం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్టాలిన్ జూ అధికారులను ఆదేశించారు.