హైదరాబాద్- కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గి, ప్రపంచమంతా కాస్త తేరుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఈ నవంబర్ లో దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్.. మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలన్నింటికి పాకుతోంది. అలా అలా మన దేశాంలోకి కూడా ఒమిక్రాన్ ప్రవేశించి, కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది.
పది రోజుల క్రితం భారత్‌లో మొట్టమొదటి ఒమిక్రాన్ కేసు నమోదు కాగా, ఇప్పటికే 200 పాజిటివ్ కేసులకు చేరింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 54, దేశ రాజధాని ఢిల్లీలో 54 కేసులు నమోదైనట్లు గఅధికారులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోను ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
నిన్నటి వరకూ తెలంగాణలో 20 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా, ఈ రోజు మరో నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 24కు చేరింది. ఇతర దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన వారిలో ముగ్గురికి, అంతకు ముందు పాజిటివ్ వ్యక్తికి కాంటాక్ట్‌లో ఉన్న మరొకరికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చిన ఆ ముగ్గురు నాన్ రిస్క్ కంట్రీ నుంచి వచ్చిన వారేనని అధికారులు చెబుతున్నారు.
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ సోకిన బాధితులను గాంధీ ఆస్పత్రితో పాటు, గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కేన్సర్ చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన వారికి ఒమిక్రాన్ సోకడంతో పరిస్థితి కొంత విషమంగా మారినట్లు సమాచారం.