వివాహా భోజనంబు అంటూ లొట్టలేసుకుంటూ వెళ్ళారు మగపెళ్ళివారు. అయితే అక్కడ విందులో మటన్ కర్రీ లేకపోవడంతో పెళ్ళి రద్దయింది. వినడానికి విచిత్రంగా ఉన్నా యదార్ధంగా జరిగిందిదే. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతిథి మర్యాదలు సరిగ్గాలేవనే కారణంతో మగ పెళ్లివారు అహంకారంతో వివాహా వేదికలు వదిలివెళ్లిపోయే ధోరణి 1980 దశకంలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఆ విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే అక్కడ ఆ వేడుకలో విందులో మేక మాంసం లేదు. ఆ విషయం చెప్పగానే వరుడి తరఫు వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వివాదం చివరికి పెద్దగా మారింది. చివరకు పెళ్లి కొడుకు పెళ్లిని రద్దు చేసుకుని తన వారితో కలిసి బయటకు వచ్చేశాడు. వరుడు అతని బంధువులు జిల్లాలోని కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజే తమ్కా పోలీసుస్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
కెంజోర్ జిల్లా రెబనాపలాస్‌పాల్‌కి చెందిన యువకుడు రమాకాంత్ పాత్రోకి మనతిరా గ్రామంలోని యువతితో రాత్రి పెళ్లి జరగాల్సి ఉంది. బంధుమిత్రులతో వరుడు ఆ గ్రామానికి చేరుకోగా వధువు కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది. తనకు మటన్ కర్రీ కావాలని తోడు పెళ్లి కొడుకు, మరికొందరు డిమాండ్ చేశాడు. తాము మేక మాంసం వండలేదని వధువు కుటుంబం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషయం వరుడికి తెలియడంతో అతడు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. చివరకు తాను ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పి వెళ్లిపోయాడు. వధువు తరఫున బంధువులు ఎంతగా నచ్చజెప్పినా రాజీకి రాలేదు. ఆ మర్నాడే తమ్కా పోలీసుస్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని పాత్రో పెళ్లి చేసుకున్నాడు.