హైదరాబాద్- విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావు 98వ జయింతిని పురస్కరించుకుని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినిమా రంగానికి, తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, తెలుగు జాతి గర్వించ దగ్గ మహా పురుషుడని కొనియాడారు. ఈ క్రమంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళులర్పించింది. పుష్ప గుచ్చం ఉంచి తన భర్త ఎన్టీఆర్ ను స్మరించుకుంది. ఈ సందర్బంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహానటుడైన నందమూరి తారకరామారావు అసలైన వారసుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆశయాలను ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ సమర్థంవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. కేవలం కడుపున పుట్టినంత మాత్రాన వారసులు కాలేరని పరోక్షంగా ఆయన కుమారులపై లక్ష్మీ పార్వతి విమర్శలు గుప్పించారు. మహానేత ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడిచి, ఆయన ఆశయాలను అమలు చేసే వారే ఆయనకు నిజమైన వారసులని ఆమ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను అనేక సంక్షేమ పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థంగా అమలు చేస్తున్నారని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. ఇక లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరణం తరువాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న లక్ష్మీపార్వతి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మెన్ గా ఉన్నారు.