ఫిల్మ్ డెస్క్- జూనియర్ ఎన్టీఆర్.. అలియాస్ నందమూరి తారక రామారావు. బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. నందమూరి వారసత్వాన్ని నిలబెడుతూ, తెలుగు పరిశ్రమలో నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో మరో హీరో రాంచరణ్ తో కలిసి నటిస్తున్నారు ఎన్టీఆర్.
ఈ సినిమాలో తారక్ కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఆయనకు జనత గ్యారేజ్ సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివతో మరో సినిమా చేయనున్నారు ఎన్టీఆర్. అంతే కాదు బ్లాక్ బాస్టర్ సినిమా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమా చేయబోతున్నారు తారక్.
ఇక చెెప్పొచ్చేదేంటంటే.. ఎన్టీఆర్ హఠాత్తుగా ఓ ప్రభుత్వ కార్యాలయంలో కనిపించారు. ఆ ఏముందిలే ఏ సినిమా షూటింగ్ కోసమో వచ్చి ఉంటారని మీరు అనుకోవచ్చు. కానీ అయన వచ్చింది ఎమ్మార్వో కార్యాలయానికి. అవును రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీస్ కు ఎన్టీఆర్ రావడంతో అక్కడ సందడి నెలకొంది. శంకర్ పల్లి సమీపంలో ఎన్టీఆర్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కొన్నారు.
అందుకు సంబందించిన రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారన్నమాట. భూమి రిజిస్ట్రేషన్ పూర్తైన తరువాత అక్కడి ఉద్యోగులతో పాటు అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు ఎన్టీఆర్. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.