ఫిల్మ్ డెస్క్- RRR.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ తరణ్ నటించిన ఈ సినిమాపై హై ఎక్స్ పెక్టెషన్స్ ఉన్నాయి. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న మూవీ కావడంతో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరి చూపు ఇప్పుడు RRRపైనే ఉంది.
సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. అంతే కాదు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితర భారీ తారాగణం ఉందీ సినిమాలో.
అసలైతే RRR సినిమా 2020 జూలై 30లోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటం, ఆ తరువాత అనివార్య కారణాల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లేట్ అవ్వడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇక అన్నీ కుదిరి ఈనెల జనవరి 7న రిలీజ్ చేసేందుకు సిద్దమవ్వగా, మరోసారి కరోనా కేసులు పెరగడంతో మళ్లీ వాయిదా వేశారు. దీంతో RRR సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఎవ్వరు చెప్పలేని పరిస్థితి నెలకొంది.
RRR సినిమా ఎప్పుడు రానుందనే దానిపై మాత్రం రాజమౌళి క్లారిటీ ఇవ్వలేదు. కరోనా పరిస్థితులు చక్కబడి దేశవ్యాప్తంగా థియేటర్స్ తెరుచుకున్న తర్వాతే RRR మూవీ రిలీజ్ అవుతుందని టాక్. ఇదిగో ఇటువంటి సమయంలో రాజమౌళి RRR విడుదల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
ఈ ఏడాది సమ్మర్ సందర్భగా ఏప్రిల్ 1న లేదంటేఏప్రిల్ 29న RRR సినిమాను విడుదల చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ సహా ఇతర సినిమా రంగాలకు చెందిన సినీ పెద్దలను RRR మేకర్స్ ఈ మేరకు చర్చలు జరుపుతున్నారని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది. ఐతే దీనిపై రాజమౌళి లేదంటే RRR టీం స్పందించాల్సి ఉంది.