హైదరాబాద్ క్రైం- ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు. సొంత వాళ్ళని చేరదీసినీ మోసం చేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూస్తున్నాం. ఇక పని వాళ్ల విషయంలో ఐతే మరీ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అదును చూసుకుని మొత్తం ఉడ్చేసుకుని వెళ్తారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పనివాళ్లే కదా అని చేరదీస్తే మొత్తం దోచుకెళ్లారు. ఈ ఘటన ఇప్పుడు నగరవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించి ఓ ఇంటిని లూటీ చేసి వెళ్లిపోయిన నేపాలీ గ్యాంగ్ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ ఆందోళన కలిగిస్తోంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ప పరిధిలో స్థానిక టెలికం నగర్‌లో ఉంటున్న గోవిండ్ పటేల్ కుటుంబం శనివారం దేవుని దర్శనం కోసం శ్రీశైలం వెళ్లింది. ఆదివారం సాయంత్రం తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్లైంది. ఇంట్లో పనివాళ్లు ఇన్నదంతా ఊడ్చుకెళ్లారు. మొత్తం కిలో బంగారు ఆభరణాలు, 15 లక్షల రూపాయల నగదును దండగులు దోచుకెళ్లిపోయారు.
సరిగ్గా నాలుగు నెలల క్రితం నేపాల్‌కి చెందిన లక్ష్మణ్, పవిత్రలు ఇంట్లో పనికి చేరారని గోవింద్ పటేల్ తెలిపారు. ఇన్నాళ్లు ఎంతో నమ్మకంగా పనిచేసిన వాళ్లు ఇలా చేస్తారని అనుకోలేదని చెప్పారు. తాము శ్రీశైలం వెళ్లిన సమయం చూసుకుని కిటికీ గ్రిల్ తొలించి, లాకర్ పగలగొట్టి దొంగతనం చేశారని గోవింద్ పటేల్ తెలిపారు. వాచ్ మెన్ లక్ష్మణ్ కుటుంబం ఎవరూ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి వెంటనే రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఇలాంటి దోపిడీలు హాగా పెరిగిపోయాయి. పనోళ్లలా ఇంట్లో చేరి, యజమానులను నమ్మిస్తున్నారు. సమయం చూసుకుని అందినకాడికి దోచుకుపోతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనతో నేపాల్ గ్యాంగుల వ్యవహారం నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో పనివాళ్లను పెట్టుకునే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని, పని వాళ్ల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు.