రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీ ప్రాంతాల్లో యాచకులు భిక్షాటన చేసుకుంటారు. డబ్బులు ఇవ్వనిదే వదిలి పెట్టరు. కొన్నిసార్లు వారిపై జాలి కలిగి కొంత మంది డబ్బులిస్తుంటారు. ఎయిర్ పోర్టులో కూడా మనం వీరిని చూడలేం. అయితే..
దేశంలో అన్ని వర్గాల ప్రజలు, అన్ని వృత్తుల వ్యక్తులు తమదైన జీవన శైలితో బతుకుతున్నారు. అయితే కొంత మంది సోమరిపోతుతనంతో పాటు కొన్ని అనివార్య కారణాలతో బిచ్చగాళ్లుగా మారుతున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, రద్దీ ప్రాంతాల్లో వీరు భిక్షాటన చేసుకుంటారు. డబ్బులు ఇవ్వనిదే వదిలి పెట్టరు. కొన్నిసార్లు వారిపై జాలి కలిగి కొంత మంది డబ్బులిస్తుంటారు. అలాగే వారి పట్ల చిన్న చూపు కూడా ఉంటుంది. కాళ్లు, చేతులు సరిగ్గా ఉన్నాయని పని చేసుకుని బతకలేవా అన్న డైలాగులు కూడా వస్తుంటాయి. ఇదేలా ఉన్న కొన్ని ప్రాంతాల్లో వీరు అడుక్కోవడం నిషిద్ధం. ఎయిర్ పోర్టులో కూడా మనం వీరిని చూడలేం. అయితే ఓ వ్యక్తి విమానం టికెట్ కొనుగోలు చేసి మరీ భిక్షాటన చేసి వార్తల్లో నిలిచాడు.
ఈ ఘటన బెంగళూరు విమానాశ్రయంలో జరిగింది. వివరాల్లోకి వెళితే విఘ్నేశ్ అనే 27 ఏళ్ల యువకుడు.. చక్కగా తయారయ్యి.. విమానాశ్రయంలోకి ప్రవేశించేందుకు చెన్నైకి టికెట్ కొనుగోలు చేశాడు. లోపలికి వెళ్లిన తర్వాత తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని, వెంటనే వైద్యం అందించాలని, అందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని ప్రయాణికుల్ని అడుగుతూ తిరిగాడు. ఇలా సుమారు రూ. ఏడు వేల నుండి రూ. 10 వేలు ఇవ్వాలంటూ వేడుకున్నాడు. మీరిచ్చే డబ్బులు వల్ల తన తండ్రిని బ్రతికించిన వాళ్లు అవుతారంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు. అలా చాలా మందిని యాచించాడు.
అతడి ప్రవర్తన చూసిన కొందరు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. విఘ్నేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనిపై 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. యువకుడి నుంచి 26 క్రెడిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాటిలో 24 క్రెడిట్ కార్డులు పనిచేస్తున్నాయని పోలీసులు తెలిపారు. అయితే ఇదంతా ఓ గ్యాంగ్ పనేనని, అందులో విఘ్నేశ్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా బెంగళూరు విమానాశ్రయంలో ఇటువంటి ఘటనే జరగ్గా.. ముంబయి విమానాశ్రయంలో కూడా ఈ తరహా సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.