దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కొన్ని గ్రామాలు ఇంకా దీనావస్థలోనే ఉన్నాయి. ప్రభుత్వాలు రోడ్ల నిర్మాణం కోసం కోట్లు వెచ్చిస్తున్నా.. కొన్ని గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదని ఓ యువతి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం బసవరాజ్ బొమ్మెకు లేఖ రాసింది.
కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు వినూత్నంగా తన గ్రామంలోని రోడ్డు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. అంతే కాదు తమ గ్రామానికి రోడ్డు వేసే వరకు తాను వివాహం చేసుకోనని శపథం చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం బసవరాజ్ బొమ్మెకు యువతి లేఖ రాసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం దేవంగరా జిల్లా హెచ్ రామ్‌పురా ప్రాంతానికి చెందిన బిందు (26) అనే యువతి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె చిన్న నాటి నుంచి గ్రామంలో సరైన రోడ్డు వసతి లేక చాలా కష్టాలు పడింది. ఈ నేపథ్యంలొో రోడ్డు సౌకర్యాలు లేక.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో మా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక దయనీయ పరిస్థితిలో ఉన్నామని.. ఇంకా వెనుకబడిపోతున్నామని… రోడ్లు సరిగా లేక మా గ్రామంలోని పిల్లలు చదువుకోవడం లేదు. అలాగే మా ఊరి అమ్మాయిలు, అబ్బాయిలకు పెళ్లి సంబంధాలు కూడా రావడంలేదు అని బిందు తన లేఖలో పేర్కొన్నారు.
బస్సు సౌకర్యంగానీ లేదు… స్కూల్, వైద్యం కోసం గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మయకొండకు వెళ్లాల్సి వస్తోంది.. ఇక తాను పాఠశాలకు వెళ్లాలంటే 14 కిలో మీటర్లు ప్రతిరోజు నడవాల్సి వస్తుందని.. అందుకే ఆడపిల్లలు చదువుకోవడం లేదు.. మధ్యలోనే బడి మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ఊరికి రోడ్డు వేయాలని మా పెద్దల కాలం నుంచి డిమాండ్ చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొంది. కాగా, బిందు లేఖకు సీఎంఓ కార్యాలయం నుంచి స్పందన వచ్చింది. అక్కడ తక్షణమే పనులు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయితీరాజ్ శాఖను సీఎంఓ కార్యాలయం ఆదేశించింది. అంతే కాదు ఆ రోడ్డు పూర్తయ్యే వరకు పనుల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.