అంతర్జాతీయ వేదికల్లో భారత్ తరుపున ఆడి, పతకాలు గెలిచి, కీర్తి, ప్రఖాత్యలు తీసుకువస్తున్న క్రీడాకారులు.. తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్లెక్కుతున్నారు. దేశానికి పేరు తీసుకు రాగానే.. అభినందనలతో ముంచెత్తే కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు న్యాయం చేయండని రెజ్లర్లు పెడుతున్న గగ్గోలును వినిపించుకోవడం లేదు.
దేశంలో ఎన్నో క్రీడలు ఉన్నాయి. కానీ క్రికెట్‌కు దక్కిన గౌరవం, డబ్బు మరే(రో) క్రీడకు దక్కడం లేదు. ఇక క్రీడాకారుల సంగతి చెప్పనక్కర్లేదు. క్రీడల్లో రారాజుగా ఏలుతున్న క్రికెట్ క్రీడాకారులు పేర్లు చెప్పమంటే మన దేశానికి చెందిన వారే కాదూ పరాయి దేశ క్రికెటర్లు, అవసరమైతే పాత తరం క్రీడాకారుల పేర్లు కూడా టకటకా చెప్పేస్తాం. అంతర్జాతీయ వేదికలపై భారత్ తరుపున ఆడి పతకాలు గెలిచి, కీర్తి, ప్రఖ్యాతలు తీసుకువస్తున్నఇతర క్రీడాకారులను గుర్తుంచుకునేది కొన్నిరోజులు మాత్రమే. ఆటలో మరింత మెరుగు పడేందుకు మౌలిక సదుపాయాలు ఇవ్వాలని కోరితేనే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అవి కూడా కోరుతూ రోడ్డు ఎక్కలేదు ఈ క్రీడాకారులు.. తమపై లైంగిక దాడి జరుగుతందని, తమకు న్యాయం చేయాలని కొన్ని నెలలుగా రెజ్లర్లు రోడ్లపై నిరసనలు చేపడుతున్నారు. మూడు నెలలుగా వీరి పోరాటం సాగుతున్నా.. కంటి తుడుపుగా అయినా చర్యలు తీసుకోవడం లేదు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.
ఎందుకు రెజ్లర్లు రోడ్డెక్కాల్సి వచ్చింది..? రోడ్డెక్కిన కుస్తీ యోధులు చేస్తున్న ఆరోపణలు ఏంటీ.. ఎందుకు ప్రభుత్వం నిందితుడి పట్ల మౌనంగా వ్యవహరిస్తుందో, అసలు ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజెపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ జనవరిలో నిరసనకు దిగారు రెజ్లర్లు. ఈ ఆందోళనల్లో బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌తో పాటు సరితా మోర్, సంగీత ఫొగాట్, సత్యవర్ట్ మాలిక్, జితేందర్ కిన్హా, సుమిత్ మాలిక్‌తో సహా 30 మంది రెజ్లర్లు పాల్గొన్నారు. ఆయనను పదవి నుండి దింపేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై క్రీడా మంత్రిత్వ శాఖ 72 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరడంతో పాటు మేరీకోమ్ నేతృత్వంలో కమిటీ వేయడంతో ఈ వివాదం సద్దుమణిగింది. దీంతో రెజ్లర్లు సైతం నిరసనను నిలిపివేశారు. ఆ సమయంలో తమ ఆందోళన ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రాజకీయ నేతల ప్రవేశాన్ని అడ్డుకున్నారు.
అయితే తాజాగా బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మరోసారి రోడ్డెక్కారు. ఆయపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు తాము ఉద్యమాన్ని ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ జెండాను రెపరెపలాడించిన రెజ్లర్లు కొన్ని నెలలుగా రోడ్లపై ఆందోళనలు చేపడుతున్నా.. అధికారంలో ఉన్న బీజెపీ ప్రభుత్వం స్పందించకపోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది. కనీసం దేశంలోని క్రికెటర్లు కూడా వారికి అండగా నిలబడటం లేదు. పరాయి దేశంలో ఏవైనా దాడులు జరిగితే స్పందించే క్రికెట్ క్రీడాకారులు.. స్వదేశంలో సమస్యలను ఎదుర్కొంటున్న క్రీడాకారులకు మద్దతు తెలుపుతూ తమ గళాన్ని విప్పలేదు. కేవలం ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మాత్రమే వారికి సంఘీభావం తెలిపారు. కాగా, ఇటీవల బీజెపీ చలవతో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన ఒకప్పటి స్టార్ క్రీడాకారిణి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష.. వీరు రోడ్డెక్కడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది క్రమశిక్షణా రాహిత్యం అంటూ మండిపడ్డారు. ఓ మహిళ అయ్యుండి తోటి మహిళా రెజ్లర్ల సమస్యను ఉష పట్టించుకోలేకపోతున్నారని సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్ వాపోయారు.
బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోకుండా ఉండకపోవడంతో పాటు మేరీకోమ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను వెల్లడించకపోవడం రెజ్లర్లతో మరింత అసహనానికి గురి చేసింది. తాజాగా ఆయన మైనర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం మరింత మండిపాటుకు కారణమైంది. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వెంటనే స్పందించిన కోర్టు.. లైంగిక ఆరోపణలు వస్తుంటే ఎందుకు కేసులు నమోదు చేయలేదంటూ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. అయితే ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోడీ సర్కార్ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావునిచ్చినట్లయింది. తమ పార్టీ నేతపై చర్యలు గురించి పక్కన పెడితే.. మౌనం వహించడం రెజ్లర్లను మరింత కుంగదీస్తుంది. ఇదేనా బీజేపీ చెప్పే బేటీ బచావోకి నిజమైన అర్థం అని ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకు పార్టీ నేతలను రక్షిస్తుందో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు.
దేశానికి పతకాలు తెచ్చినప్పుడు మెచ్చుకుని.. అవసరమైతే ప్రత్యేకంగా అభిమానించే ప్రధాని మోడీ నుండి కానీ ఆయన కార్యాలయం నుండి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడం ప్రశ్నలు లెవనెత్తినట్లవుతుంది. సుప్రీం పెట్టిన చీవాట్లతో హడావుడిగా కంటి తుడుపు చర్యల్లో భాగంగా రెండు కేసులను నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కానీ అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తొలిసారి రోడ్లపై బైఠాయించిన రెజ్లర్లు.. రాజకీయాలకు తావునివ్వలేదు. అయితే ఇప్పుడు ఎంత మొత్తుకున్నా బీజెపీ నేతపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో రాజకీయ అండ కావాల్సి వచ్చింది. వీరి నిరసనకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా సంఘీభావం తెలిపారు. శనివారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్‌కు వెళ్లిన ప్రియాంక గాంధీ.. అక్కడ ఆందోళన చేస్తున్న రెజ్లర్లను కలుసుకున్నారు. మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగట్‌లతో మాట్లాడారు. రెజ్లర్ల ఆందోళనకు మద్దతు తెలిపారు. అటు ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ , ఇతర నేతలు కూడా వారికి సంఘీ భావం తెలుపుతున్నారు.