పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలను చూస్తే.. అది నిజమేమో అనిపిస్తుంది. గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామనుకున్నవారు పెళ్లి పీటల వరకు రాలేకపోతున్నారు. పెళ్లి పీఠల వరకు వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. నిన్న నిజమాబాద్‌లో ఓ యువతి పెళ్లికి కొన్ని గంటల ముందు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సమయానికి దూలానికి వేలాడుతూ కనిపించింది. మరో ఘటనలో యువతే పీటలపై పెళ్లిని ఆపేసింది. అందుకు కారణంగా వరుడు నల్లగా ఉన్నాడని చెప్పింది. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, మహరాజ్‌గంజ్ జిల్లా యార పోలీస్ స్టేషన్ పరిథికి చెందిన ఓ యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతికి కొన్ని నెలల క్రితం పెళ్లి కుదిరింది.
నెల రోజుల క్రితమే ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. పెళ్లిని డిసెంబర్ 8న చేయాలని రెండు కుటుంబాల వారు నిర్ణయించుకున్నారు. పెళ్లి కుమారుడు తన పెళ్లి గురించి ఏన్నో కలలు కంటూ ఉన్నాడు. కాబోయే భార్యతో తన జీవితాన్ని ఊహించుకుంటూ సంతోషపడిపోతున్నాడు. పెళ్లి పనులు కూడా వేగంగా జరుగుతూ వచ్చాయి. పెళ్లి రోజు దగ్గరపడే కొద్దీ పెళ్లి కుమారుడు సంతోషంలో మునిగి తేలుతూ ఉన్నాడు. అతడు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పెళ్లికి పెద్ద సంఖ్యలో బంధువులు కూడా వచ్చారు. ఇక, పెళ్లిలో దండలు మార్చుకునే సమయం వచ్చింది. ముందుగా పెళ్లి కూతుర్ని.. పెళ్లి కుమారుడి మెడలో దండ వేయమని అన్నారు. పెళ్లి కుమారుడు ఎంతో సిగ్గుతో కూడిన ఆసక్తితో ఆమె వైపు చూస్తూ ఉన్నాడు.
కానీ, ఆ యువతి అతడి మెడలో దండ వేయలేదు. అక్కడివారు ఎందుకు దండవేయటం లేదని అన్నారు. దీంతో ఆ యువతి పెళ్లి పీటలపై నుంచి పక్కకు వచ్చేసింది. తన ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. వాళ్లు ఎందుకని ప్రశ్నించగా.. పెళ్లి కుమారుడు నల్లగా ఉన్నాడని అంది. పెళ్లి కుమారుడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. బాధలో ఏడుపు ముఖం పెట్టుకున్నాడు. ఏడుస్తూ ఆ పెళ్లి కూతురివైపు చూశాడు. అయినా ఆమె కనికరించలేదు. అతడి వంక చూసి అసహ్యించుకుంది. పెళ్లికి వచ్చిన పెద్దలు ఎంత బతిమాలినా కూడా ఆమె ఒప్పుకోలేదు. పోలీసులు రంగ ప్రవేశం చేసి చర్చలు జరిపినా ఆమె వినిపించుకోలేదు. దీంతో సదరు పెళ్లి కుమారుడి ఆశ ఆవిరై పోయింది. జీవితంలో కోలుకోలేని దెబ్బతగిలినట్లు అయింది.