ఏ ఆపద కలిగినా ఎలాంటి భయం వేసినా హనుమాన్ చాలీసా చదువుకుంటే కొండంత ధైర్యం ఉంటుందని పెద్దలు చెప్తారు.వారికి హనుమంతుడు రక్షణ కలిగిస్తాడని భక్తులు నమ్ముతారు .ఆ నమ్మకం అబద్ధం కాదని నిజమని నిరూపించింది ఈ యదార్థ గాధ!
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వైద్యులు 24 ఏళ్ల ఓ యువతికి బ్రెయిన్ ఆపరేషన్ నిర్వహించే క్రమంలో.. ఆమె హనుమాన్ చాలీసాను పఠించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎయిమ్స్ వైద్యులు జరిగిన ఈ సంఘటన గురించి తెలిపారు. టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న 24 ఏళ్ల యుక్తి అగర్వాల్ అనే మహిళకు బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా ఆమె హనుమాన్ చాలీసా పఠించినట్లు ఎయిమ్స్ న్యూరోసర్జరీ విభాగం వైద్యుడు దీపక్ గుప్తా తెలిపారు.
మూడున్నర గంటల పాటు ఈ కీలక ఆపరేషన్ నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించామని.. అప్పటివరకూ ఆమె స్పృహలోనే ఉన్నారని తెలిపారు. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఆమె హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలను పఠించిందని పేర్కొన్నారు.
ఆమెకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో.. అనెస్థీషియా ఇవ్వడంతో పాటు నొప్పి నివారణ ఔషధాలు కూడా వాడామని వెల్లడించారు. కాగా.. మెదడు ఆపరేషన్ల సమయంలో రోగులు మెలకువతో ఉండాల్సిన అవసరాన్ని కూడా దీపక్ గుప్తా వివరించారు.
ఇలాంటి ఆపరేషన్ సమయంలో రోగులు మెలకువతో ఉండడం వల్ల వారి మెదడులోని ఏ కీలక భాగం కూడా దెబ్బతినే ప్రమాదం ఉండదని వివరించారు. ఆమె చికిత్స మధ్యలో వైద్యులతో సహకరించడం విశేషమని దీపక్ గుప్తా వెల్లడించారు.ఈ సంఘటన పట్ల వైద్య బృందం ఇది చాలా ఆశ్చర్య కరమైనదిగా భావిస్తూ హర్షం వ్యక్తం చేసారు.