చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు బీహార్ కు చెందిన శివర్తి దేవి అనే మహిళ. మనిషి చదువు కోవాలనే తపన ఉండాలే కానీ వయస్సు అనేది అసలు అడ్డమే కాదని నిరూపిస్తూ ఆమె వార్తల్లో నిలిచారు
చదువుకు వయసు ఎంతమాత్రం అడ్డు కాదు. చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ అందుకోసం ఎన్ని కష్టాలు ఎదుర్కొనేందుకైన కొందరు సిద్ధంగా ఉంటారు. అలానే కొందరు చదువుపై ఉన్న ఆసక్తిని తీర్చుకునేందుకు వయసు మీద పడిన తరువాత కూడా విద్యాభ్యాసం చేస్తుంటారు. ఇటీవలే కేరళకు చెందిన 84 ఏళ్ల ఓ బామ్మ.. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పరీక్షలో 100కి 94 మార్కులు సాధించి.. ఔరా అనిపించారు. తాజాగా బీహార్ కు చెందిన శివర్తి అనే మహిళ కూడా అలాంటి ఘనతే సాధించింది. నలుగురు కోడళ్లతో కలిసి ఆ అత్త పరీక్ష రాసింది. దీంతో చదువుపై ఆమెకు ఉన్న తపనను చూసి అందరూ ఆశ్చర్యాని వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రం నలంద ప్రాంతానికి చెందిన శివర్తి దేవి అనే 45 ఏళ్ల మహిళ.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు చిన్నతనం నుంచి చదువు అంటే అమితమైన ఆసక్తి. అయితే చిన్నతనంలో కుటుంబ, ఇతర పరిస్థితుల కారణంగా చదువుకోలేక పోయింది. అనంతరం పెళ్లి చేసుకుని సంసార జీవితంలో చాలా ఏళ్లు గడిపింది. ఈక్రమంలోనే ఆమె కొడుకులకి పెళ్లి చేసి.. నలుగురు కోడళ్లను ఇంటికి తెచ్చుకుంది. ఇటీవలే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి అక్షర్ అంచల్ యోజన్’ పథకం కింద మహిళలకు ప్రాథమిక పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు శివర్తి తో పాటు ఆమె కోడళ్లు శోభా దేవి, సీమాి దేవి, వీణా దేవి, బింది దేవిలు కూడా సిద్ధమయ్యారు.
ఇటీవలే నిర్వహించిన ఈ పరీక్షల్లో శివర్తి.. నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. ఇంటి పనులు చూసుకుంటూ చదువుకుని కోడళ్లతో పాటు పరీక్షలు రాసింది. ఈ నలుగురు కోడళ్లతో పాటు శివర్తి దేవి కూడా ఈ పరీక్ష కోసం ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అనంతరం గత ఆదివారం ప్రాథమిక పరీక్ష రాసిన శివర్తి దేవి వార్తల్లో నిలిచారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అత్తా కోడళ్లు పరీక్ష రాసిన చాలామందికి కొత్త స్ఫూర్తిగా నిలిచారు. ఏమైనా.. వీరందరిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. అలానే చాలా మంది ఈ అత్తాకోడళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.