పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఇటీవల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించి మమతా బెనర్జీ మూడవ సారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఆసేతు హిమాచాలం అంతా కాషాయం గాలీ విస్తున్న తరుణంలో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇక తలలు పండిన రాజకీయ మేధావులు అంతా బెంగాల్‌లో జరగనున్న ఎన్నికల్లో దీదీ ఓడిపోవటం ఖాయంగా కనిపిస్తోందంటూ పలుకులు పలికారు. ఇక అధికార బీజేపీ కూడా అదే అశతో పల్లికిలో ఊరేగింది. దీంతో రాష్ట్రం అంతా కలయిక తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించింది.
ఈ సారి ఎలాగైన దీదీని ఓడించేందుకు బీజేపీ అగ్రనేతలంతా బెంగాల్‌లో వాలిపోయి హోరెత్తిపోయేలా ప్రచారం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా వ్యాప్తిస్తున్న మోడీ మానియాను అంచనా వేసుకుని బెంగాల్ ఎన్నికల్లో గెలుపే కాషాయం పార్టీ ముందుకు కదిలింది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో బీజేపీ జెండా పాతేందుకు అన్ని అవకాశాలు మెండుగా ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ బెంగాల్‌లో మరోసారి విజయ పరంపరను కొనసాగిస్తూ తృణమూల్ కాంగ్రెస్ విజయ జెండా ఎగరవేసింది. మోడీ ఎత్తులను బెంగాల్ ఫైర్ బ్రాండ్ దీదీ చిత్తు చేస్తూ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది.
కానీ తాను పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా కుడి భుజం అయిన సువేందు అధికారి చేతిలో కొద్ది పాటి ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిభందనల ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మమతా బెనర్జీ. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెల్లలోగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏదైన చట్టసభ నుంచి ఎన్నిక కావాల్సి ఉంది. ఇలా ఎన్నిక కాకుంటే దీదీ సీఎం పీఠం నుంచి దిగిపోయే అవకాశం ఉంటుంది.
ఇక ఈ క్రమంలోనే ఎలాగైన ఏ చట్టసభ నుంచైనా ఎన్నికై ముఖ్యమంత్రి స్థానాన్ని పదిలంగా ఉంచుకునేందుకు తెర వెనుక మంతనాలు చేస్తోంది బెంగాల్ ఫైర్ బ్రాండ్. కాగా బెంగాల్‌లో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో ఎన్నికల కమిషన్ నోటీఫికేషన్‌ను విడుదల చేయనుందని తెలుస్తోంది. ఇక ఈసారి తన సొంత నియోజకవర్గం భవానిపుర్ నుంచి దీదీ పోటీకి దిగనుందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఇదిగాక మండలి ఏర్పాటుకు కూడా సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఇది కూడా దీదీకి కలిసొచ్చే అంశంగా తెలుస్తోంది. దీనిని ఆసరగా చేసుకుని మమతా అనుకున్నట్లు మండలి ఏర్పాటయితే ఎమ్మెల్సీగా ఎన్నిక కానుంది. దీంతో దీదీ సీఎంగా కొనసాగడానికి ఈ విధంగా కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏదీ ఏమైనా సీఎం పీఠం ఏ రకంగా కూడా చేజారదని పార్టీలోని వర్గం నేతలు బాహాటంగా చెబుతున్నారు. ఇక రానున్న రోజుల్లో సీఎం మమతా బెనర్జీ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.